వైభవంగా వినాయకుడికి విశేష పూజలు..
వైభవంగా వినాయకుడికి విశేష పూజలు..
సంకటహర చతుర్థి వేళ గణనాథుడికి పూజలు
పాత యాగశాల వద్ద వైభవంగా గణపతి హోమం
ఆగమ శాస్త్రోక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆరాధనలు
లక్ష్మీ గణపతి సన్నిధిలో భక్తుల రద్దీ
విఘ్నేశ్వరుని అనుగ్రహం కోసం భక్తుల ప్రత్యేక ప్రార్థనలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సంకటహర చతుర్థి సందర్భంగా గురువారం శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఆలయ పాత యాగశాల వద్ద ఆలయ అర్చకులు కార్తీక్‌తో పాటు ఇతర అర్చక బృందం, వైదిక కమిటీ పర్యవేక్షణలో ఆగమ శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. ఆనవాయితీ ప్రకారం శ్రీ గణేష్ మహారాజ్‌కు గణపతి హోమం, ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
పూజా సామగ్రితో స్వామివారిని ఆరాధించి, ఆయనకు ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు శాస్త్రోక్త విధానాలకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించారు. విఘ్నేశ్వరునికి ప్రత్యేక అలంకరణలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
సంకటాలను తొలగించే దేవుడిగా భావించే గణనాథుని ఆశీస్సుల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు లక్ష్మీ గణపతి సన్నిధిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పూజా కార్యక్రమాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కళకళలాడింది.

సంకటహర చతుర్థి వేళ నిర్వహించిన గణపతి హోమం, విశేష పూజలు ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి. భక్తులు స్వామివారి అనుగ్రహం పొందుతూ తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
