రెండు నెలల్లోనే హామీలు నెరవేర్చిన ప్రజా ప్రతినిధి

రెండు నెలల్లోనే హామీలు నెరవేర్చిన ప్రజా ప్రతినిధి
-గతంలో నిర్లక్ష్యం…ఇప్పుడు అభివృద్ధి పథంలో మోడల్ కాలనీ
-వేగవంతంగా సాగుతున్న అభివృద్ధి పనులు
-మా సమస్యలు విన్న తొలి నాయకుడంటూ ప్రజల కృతజ్ఞతలు
-ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని కౌన్సిలర్ రవి హామీ
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ: స్టేషన్ మున్సిపాలిటీలోని 18వ వార్డు మోడల్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శుక్రవారం కౌన్సిలర్ పొన్న రవి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఆయనను కలిసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. గతంలో ఎవరూ తమ కాలనీ సమస్యలను పట్టించు కోలేదు. ఏ ప్రజా ప్రతినిధి కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించలేదని వారు తెలిపారు. అయితే కౌన్సిలర్‌గా ఎన్నికైన తర్వాత కేవలం రెండు నెలల్లోనే తమ వద్దకు వచ్చి సమస్యలను తెలుసుకున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి పనులు ప్రారంభించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల వంటి ప్రాథమిక సదుపాయాల పనులు వేగంగా కొనసాగుతుండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పొన్న రవి మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
