జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి…

జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి…
ఇంచార్జి కలెక్టర్
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రస్తుతం జిల్లాలోఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని తగినన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ ఎం నవీన్ పిలుపునిచ్చారు.
గురువారం ఉదయం నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయం ముంగిట శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని జిల్లా ఇన్చార్జి కలెక్టర్, అదనపు ఎస్పీ సత్యనారాయణతో కలిసి ప్రారంభించి ప్రజలకు, మంచినీరు మజ్జిగ పంపిణీ చేశారు

ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఎండ వేడిమి ఎక్కువగా ఉండడంతో ప్రజల సౌకర్యం కోసం శ్రీ సత్య సాయి సేవ సమితి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చలివేంద్రంలో మంచినీటితో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేయడం చాలా సంతోషదాయకమన్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని, తెల్లని వస్త్రాలు, తలకు టోపీ గాని తలపాగా గాని ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు
అంతేకాకుండా ప్రజలు మంచినీరు, మజ్జిగ , కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగాలని, శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. అదనపు ఎస్పి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకమన్నారు. సమితి వారు ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం, కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగే మీకోసం కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు స్వచ్ఛందంగా అల్పాహారము మంచినీరు అందజేసి ఎంతగానో తోడ్పాటు అందిస్తున్నారన్నారు.
అలాగే ప్రతి సంవత్సరము సమితి వారు చలివేంద్రం ఏర్పాటు చేసి చాలా పద్ధతి ప్రకారం నడుపుతూ ప్రజలందరికీ మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉంచుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సహాయ కమిషనర్ గోపాలరావు, శ్రీ సత్యసావ సమితి సేవా సమితి జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్, కన్వీనర్ పోతు కూచి ఆంజనేయ కుమార్, సహ కన్వీనర్ ఆనుమకొండ వెంకటేశ్వరరావు పలువురు పోలీసులు, సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.
