రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన

రోడ్డు భద్రతపై విద్యార్థుల్లో అవగాహన

బాసర సీఐ కిరణ్ కుమార్

బాసర, (నిర్మల్ జిల్లా) ఆంధ్ర‌ప్ర‌భ : ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాలు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. చిల్డ్రన్ రోడ్ సేఫ్టీ డే పురస్కరించుకుని బుధవారం ఉదయం బాసరలోని నాగభూషణ పాఠశాలలో బాసర సీఐ కిరణ్ తన సిబ్బందితో కలిసి విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల సమీపంలోని చౌరస్తా వద్ద పాఠశాల విద్యార్థులచే మానవహారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సిఐ కిరణ్ నాగభూషణ పాఠశాల ప్రిన్సిపల్ జే. బాబూరావుతో కలిసి విద్యార్థులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలపై విద్యార్థుల్లో చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరమని తెలిపారు. ట్రాఫిక్ సిగ్నల్ గురించి, సిగ్నల్ వద్ద ట్రాఫిక్ ఐలాండ్, జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలు ఆగినప్పుడు వైట్ బ్లాక్ లైన్ వద్ద రోడ్డు క్రాస్ చేయడం వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. టి జంక్షన్, ఎక్స్ రోడ్ వద్ద నియమాలు పాటించాలని సూచించారు.

విద్యార్థులే రోడ్డు భద్రతకు బ్రాండ్ అంబాసిడర్లు అని, పిల్లలు చెప్పే మంచి విషయాలను ప్రతి ఒక్కరూ గౌరవంగా స్వీకరిస్తారని అన్నారు. కుటుంబ సభ్యులు వాహనాల్లో ప్రయాణించే సమయంలో హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ ధరించడం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అంశాలు, అతివేగం ప్రమాదాలు వంటి విషయాలపై అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ బాబురావు మాట్లాడుతూ .. రోడ్డు భద్రత పై విద్యార్థులకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు.

ప్రతీ ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటించాలని, తల్లిదండ్రులకు కూడా ఈ విషయాలపై చైతన్య పరచాలని చెప్పారు.కార్యక్రమం ముగింపులో సీఐ, పాఠశాల ప్రిన్సిపల్ లు విద్యార్థులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సుమేర, దీపిక, చారి, సుభాష్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply