గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల ..

గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల ..
లండన్ విద్యార్థినికి ఆదర్శంగా నిలిచిన కప్పట్రాళ్ల ప్రకృతి వ్యవసాయం…
గ్రామీణ రైతుల సుస్థిర సాగు విధానాలకు అంతర్జాతీయ గుర్తింపు…
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామీణ వ్యవసాయం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న దానికి కప్పట్రాళ్ల గ్రామం మరో ఉదాహరణగా నిలిచింది. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థిని భవిక, జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి మాధురితో కలిసి గ్రామాన్ని సందర్శించడం విశేషం. గ్రామంలోని రైతు రంగస్వామి పొలాన్ని సందర్శించిన భవిక, అక్కడ అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను సమగ్రంగా పరిశీలించారు.
విత్తనాల ఎంపిక, సాగు పద్ధతులు, ప్రకృతి వ్యవసాయ చక్రం అమలు విధానం వంటి అంశాలను రైతులు ప్రత్యక్షంగా వివరించారు. పొలంలో మహాగని, టెంకాయ మొక్కలను నాటి, పిఎండిఎస్ విధానంలో విత్తనాలు వేసిన తీరు ఆకట్టుకుంది. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా పెంచుతున్న మామిడి, సపోటా తోటలను పరిశీలించిన భవిక, రైతులు అమలు చేస్తున్న ఆగ్రో ఫారెస్ట్రీ పద్ధతులను ప్రశంసించారు. సే ట్రీస్ వంటి సంస్థల సహకారంతో గ్రామంలో అభివృద్ధి చెందుతున్న తోటలు సుస్థిర వ్యవసాయానికి నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రకృతి వ్యవసాయాన్ని ఆదర్శంగా అమలు చేస్తున్న రంగన్న దంపతులను ఈ సందర్భంగా సన్మానించారు. అనంతరం గ్రామ జ్యోతి కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గ్రామాన్ని దత్తత తీసుకున్న ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రవికృష్ణ మాట్లాడుతూ కప్పట్రాళ్ల గ్రామాన్ని పూర్తిస్థాయి ప్రకృతి వ్యవసాయ గ్రామంగా తీర్చిదిద్దడం లక్ష్యమని తెలిపారు. ప్రతి రైతు ఈ విధానాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.
మహిళా సంఘాల ద్వారా ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి మాధురి మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టాలని సూచించారు. త్వరలో బీఆర్‌సీ సెంటర్ ప్రారంభించి రైతులకు అవసరమైన ప్రకృతి కషాయాలను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. శాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫుడ్ బాస్కెట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పొదుపు మహిళా సంఘాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వేసవికాలంలో పిఎండిఎస్ విధానాన్ని పాటించడం ద్వారా దిగుబడులు పెరుగుతాయని, ప్రకృతి వ్యవసాయం రైతులకు ఆర్థిక, ఆరోగ్య పరమైన లాభాలను అందిస్తుందని వివరించారు. చివరిగా కప్పట్రాళ్ల మల్లికార్జున చీని తోటను సందర్శించి, అగ్రో ఫారెస్ట్రీ మోడల్‌లో సాగు చేస్తున్న విధానాన్ని అభినందించారు.
అంతర్ పంటలు వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ జ్యోతి సీఈఓ నారాయణ, స్థానిక నాయకులు, రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ వ్యవసాయం నుంచి గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల ప్రయాణం కొనసాగుతోంది.
