శ్రద్ధా పాటిల్.. విజయగాథ..

శ్రద్ధా పాటిల్.. విజయగాథ..

కృష్ణ, ఆంధ్రప్రభ : కృష్ణ మండలానికి చెందిన ప్రముఖ బీఆర్ఎస్ నాయకుడు శివరాజ్ పాటిల్ గురజాల కుమార్తె శ్రద్ధా పాటిల్ కర్ణాటక అండర్-15 మహిళా క్రికెట్ జోనల్ జట్టుకు ఎంపిక కావడం ఆ ప్రాంత ప్రజలకు గర్వకారణంగా మారింది. రాష్ట్ర సరిహద్దులో ఉన్న గ్రామం నుంచి ఒక బాలిక రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం విశేష ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది.

చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న శ్రద్ధా పాటిల్, క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ అరుదైన అవకాశాన్ని అందిపుచ్చుకుంది. గ్రామీణ వాతావరణంలో పరిమిత వనరుల మధ్య కూడా తన లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా కఠినంగా శ్రమించి, రాష్ట్ర స్థాయి ఎంపికదారుల దృష్టిని ఆకర్షించింది. బాలికల క్రీడా రంగంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ఎదుగుతున్న ప్రతిభకు శ్రద్ధా ఎంపిక మంచి ఉదాహరణగా నిలుస్తోంది.

కర్ణాటక అండర్-15 మహిళా జోనల్ జట్టుకు ఎంపిక కావడం ద్వారా శ్రద్ధా పాటిల్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగగల సామర్థ్యం కలిగిన క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. ఈ విజయంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సరిహద్దు ప్రాంత గ్రామాల నుంచి కూడా జాతీయ స్థాయి క్రీడాకారులు ఎదగగలరని ఈ ఎంపిక మరోసారి నిరూపించింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, యువత శ్రద్ధా పాటిల్‌ను అభినందిస్తూ, భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి చేరాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ.. “మన ప్రాంతానికి ఇది గర్వకారణం. మా గ్రామం నుంచి రాష్ట్ర జట్టులో చోటు సంపాదించడం ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని కలిగించింది” అని పేర్కొన్నారు. శ్రద్ధా పాటిల్ విజయం గ్రామీణ బాలికల్లో క్రీడాపట్ల మరింత ఆసక్తిని పెంచేలా ఉందని, తల్లిదండ్రులు కూడా బాలికలను క్రీడల్లో ప్రోత్సహించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా శివరాజ్ పాటిల్ మాట్లాడుతూ.. “నా కుమార్తె శ్రద్ధా పాటిల్ కర్ణాటక అండర్-15 మహిళా క్రికెట్ జోనల్ స్థాయిలో ఎంపిక కావడం నాకు అపారమైన ఆనందాన్ని కలిగించింది. చిన్న వయస్సులోనే క్రీడా రంగంలో ఆమె సాధించిన ఈ విజయం, ఆమె కష్టపడి చేసిన సాధనకు అంకితభావానికి ప్రతిఫలంగా నిలిచింది. ఆమె రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి దేశానికి గౌరవం తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు.

అలాగే ఆమెకు మార్గదర్శకత్వం అందించిన జై విజయ క్రికెట్ అకాడమీ, రాయచూర్ చైర్మన్ శ్రీనివాస నాయక్ కోచ్ కి, ముత్తు, సిద్ధలింగయ్య సార్, యాదగిరి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి విజయాలు మరెందరికో ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. మొత్తానికి, శ్రద్ధా పాటిల్ సాధించిన ఈ విజయం గ్రామీణ ప్రాంత బాలికలకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా నిలిచింది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply