650 కిలోల పాతపుస్తకాలు సేకరించిన అన్నపూర్ణ..

650 కిలోల పాతపుస్తకాలు సేకరించిన అన్నపూర్ణ..

ఐటీసీ ‘వావ్’ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్…

విజయవాడ, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణకు ఐటీసీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ (వావ్) కార్యక్రమం ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్షిప్ లో అధిక మొత్తంలో పాత పుస్తకాలను సేకరించిన విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ కు చెందిన 8వ తరగతి విద్యార్థిని, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ కుమార్తె అన్నపూర్ణను పలువురు అభినందించారు. తండ్రి పట్టాభిరామ్ ఆశయాలకు అనుగుణంగా, ఆయన బాటలో నడుస్తున్న అన్నపూర్ణ ఐటీసీ వావ్ ప్రతినిధులు, స్కూల్ నిర్వాహకులు, ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకుంది. విద్యార్థులు తాము సేకరించిన పాత పుస్తకాలను ఏజీఎస్-ఐటీసీ నిర్వాహకులకు అందజేశారు.

ఈ సందర్భముగా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్ భువనేశ్వరన్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగమైన చెట్లను కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. అత్యధికంగా పాత పుస్తకాలను సేకరించిన విద్యార్థిని అన్నపూర్ణను ప్రత్యేకంగా అభినందించారు. వావ్ ప్రతినిధులు గణేష్, కిరణ్ మాట్లాడుతూ, వాడిన కాగితాన్ని రీసైకిల్ చేయడం ద్వారా కేవలం ఒక మెట్రిక్ టన్ను (1,000 కిలోల) కాగితంతో మన భూమిని అనేక రకాలుగా రక్షించవచ్చని తెలిపారు.

ఇది 17 నుండి 20 చెట్లు, 26,000 లీటర్ల నీరు, సుమారు 4,000 యూనిట్ల విద్యుత్ ను ఆదా చేస్తుందని వివరించారు. అంతే కాకుండా, ఇది 1,500 లీటర్ల ఇంధనాన్ని ఆదా చేస్తుందని, సుమారు ఒక టన్ను కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తుందని చెప్పారు. ముఖ్యంగా ఇది సుమారు 3.3 ఘన మీటర్ల స్థలాన్ని చెత్త డబ్బాలలోకి వెళ్ళకుండా నివారిస్తుందని తెలిపారు. అంటే, మూడు పెద్ద చెత్త కుండీలకు సమానమైన వ్యర్థాలు భూమిలో కలవకుండా అడ్డుకుంటుందన్నారు.

కాగితాన్ని రీసైకిల్ చేయడం ద్వారా మనం చెట్లు, నీరు, విద్యుత్‌ను కాపాడుతున్నామని చెప్పారు. భూమిని శుభ్రంగా, పచ్చగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతున్నామన్నారుప్రతి ఒక్కరు రీసైక్లింగ్ కు సహకరిస్తే చెట్లను కాపాడుకోవచ్చని చెప్పారు. అనంతరం వివిధ అంశాల్లో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు, ధృవపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని అన్నపూర్ణ అత్యధికంగా 650 కిలోల పాత పుస్తకాలను నిర్వాహకులకు అందజేసి ప్రశంసా పత్రం అందుకుంది. ఈ కార్యక్రమంలో వావ్ ప్రతినిధులు హరీష్, హేమంత్, జ్యోతి, స్టేట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమ మహేశ్వరి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave a Reply