ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ

ఆయిల్ ఫామ్ రైతులకు మహర్దశ
టన్ను గెలలు ధర 21,546
దమ్మ పేట, ఆంధ్రప్రభ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషితో పామాయిల్ రైతుల పంట పండింది. తాజాగా విడుదల చేసిన టన్ను ఫ్రూట్ ధర 21,546 రూపాయలకు చేరడంతో రైతుల మోముల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 15,024 మంది రైతులకు 2 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో రేవంత్ సర్కార్ కొలువు తీరాక 1,07,400 ఎకరాల్లో 33,500 మంది రైతులు పామాయిల్ సాగు చేపట్టారని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఏడాది ఆయిల్ ఫామ్ సాగుకు 456 కోట్లు కేటాయింపు జరిగిందని తెలిపారు. ఆయిల్ ఫామ్ ధర అనుకున్న స్థాయి కంటే అధికంగా పెరగటంతోఆయిల్ ఫామ్ రైతులు మంత్రి తుమ్మలను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు బాటలు వేసిన మార్గదర్శి తుమ్మల అని రైతులు కొనియాడారు. లక్షలాది రైతుల కుటుంబాల తలరాత మారేలా ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ జరగనుందని పది లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ లక్ష్యం అని మంత్రి తెలిపారు.
