political| కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్

political| కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క ఇల్లు అయినా కట్టారా అని ఆయన ప్రశ్నించారు. వారు గద్దెనెక్కిన తర్వాత ఎన్నో ఇళ్లను కూలగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధానికి వెళ్లినట్లు నిన్న ఖమ్మంలో ఇళ్లు కూలగొట్టారన్నారు. ప్రభుత్వాలు ఇచ్చిన అనుమతులతోనే ఇళ్లు కట్టుకున్నారని, వాటిని ఎలా కూలగొడతారని నిలదీశారు. ఇంటి పన్ను, నీళ్ల పన్ను, కరెంట్ బిల్లులు కడుతున్నా ఇళ్లను కూలగొడతారా అని మండిపడ్డారు. అన్ని అనుమతులు ఉన్న ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీ అభివృద్ధికి కేసీఆర్ ప్రణాళికలు చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డిలా కేసీఆర్ ఎప్పుడైనా ఇల్లు కూలగొట్టలేదన్నారు. సీఎం, డిఫ్యూటీ సీఎంకు 2, 3 ఇళ్లులు ఉండొచ్చు.. పేదవాడికి ఒక్క ఇల్లు కూడా ఉండకూడదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఒక్క ఇల్లు కట్టినట్లు రేవంత్ చూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ దుశ్చర్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని హైదర్షాకోట్, కేకేనగర్ మూసీ బాధితులు పాదయాత్ర చేపట్టారు. మూసీ ప్రక్షాళన పేరిట ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ అనే నినాదంతో భారీగా నిరసన ప్రదర్శన చేశారు. అయితే బాధితులు చేపట్టిన ఈ మూసీ దండి మార్చ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప నిర్వాసితులతో కేటీఆర్ మాట్లాడిన భరోసా కల్పించారు.
