వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు ఎంతో మేలు

వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థులకు ఎంతో మేలు

  • జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

మాక్లూర్, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికితీస్తూ, వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. మండల పరిధిలోని దాస్ నగర్ లోని నవ్యభారతి గ్లోబల్ స్కూల్ లో యంగ్ ఇన్నోవేటర్స్ ఇన్ యాక్షన్ “ఆవిష్కార్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అవిష్కార్ ప్రదర్శనలు ప్రారంభించారు. విద్యార్థిని విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక ప్రదర్శనల నమూనాలను ఎంతో ఆసక్తితో ఒక్కొక్కటి తిలకించారు. లాభదాయకమైన కూరగాయల పంటల సాగు, సోలార్ వినియోగం, పర్యావరణ పరిరక్షణకు ఉపకరించే సాధనాలు, కాలుష్య నియంత్రణ, ట్రాఫిక్ నిబంధనలు, ఆరోగ్యకరమైన ఆహారం, సన్ డయల్, అంతరిక్ష పరిశోధన నమూనాలు తదితర అంశాలపై సరికొత్త ఆలోచనలతో సృజనాత్మకతను జోడిస్తూ ప్రదర్శనలు రూపొందించిన విద్యార్థులను అభినందించారు.

ఒక్కో ఎగ్జిబిట్ ను సందర్శిస్తూ, వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ కేవలం తరగతి గది, పుస్తకాలకే పరిమితం కాకుండా అనేక అంశాలలో విద్యార్థులు సైన్స్ ఫేర్ లో పాల్గొని తమ ప్రతిభను చాటడం ఎంతో గొప్ప విషయమని, ఈ దిశగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రోత్సహించడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులు మరిన్ని కొత్తకొత్త
ప్రయోగాలు చేసేలా తోడ్పాటును అందించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. ఇందులో జిల్లా విద్యాధికారి పి. అశోక్, మండల విద్యాధికారి సత్యనారాయణ, పాఠశాల చైర్మన్ కే. సంతోష్ కుమార్, కరెస్పాండెంట్ కే. శ్రీదేవి, ప్రిన్సిపాల్ అంటోనీ, హెచ్ ఆర్ టీ. లత, పీ.డీ అజ్మాత్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply