Supporting | కాలు కోల్పోయిన యువకుడికి అండగా..

Supporting | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన నిరుపేద యువకుడికి నేనున్నానంటూ ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ ముందుకు వచ్చి ఆ యువకుడికి మళ్ళీ నడిచే ధైర్యాన్ని ఇచ్చింది. మునుగోడు మండలంలోని కలవలపల్లికి చెందిన వంటేపాక గణేష్ వాటర్ ప్యూరిఫైయర్ టెక్నీషియన్ గా పని చేస్తూ, ముంబైలో కూలి పని చేసే తండ్రి దశరథకు చేదోడు వాదోడుగా ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం దేవరకొండలో పని ముగించుకుని తిరిగి వస్తుండగా, నల్గొండ సమీపంలో కారు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో గణేష్ కుడి కాలు కోల్పోయాడు.
కాలు లేకపోతే పనికి వెళ్ళలేను. పని చేయకపోతే ఇల్లు గడవదని కుమిలిపోతున్న గణేష్ గురించి తెలుసుకున్న ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ ఇరుగదిండ్ల భాస్కర్ అభయహస్తం అందించారు. అతనికి కృత్రిమ కాలును ఉచితంగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్బంగా ఇ ఎల్ వి భాస్కర్ ఫౌండేషన్ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ భవిష్యత్తులో గణేష్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. పేదరికంతో ఏ ఒక్కరూ విద్య, వైద్యానికి, ఉపాధికి దూరం కాకూడదన్నదే తమ ఫౌండేషన్ లక్ష్యమని పేర్కొన్నారు.
