Petition | కలెక్టర్ మేడం.. ముంపు గ్రామంగా ప్రకటించండి..

Petition | కలెక్టర్ మేడం.. ముంపు గ్రామంగా ప్రకటించండి..

  • ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన నాయకులు

Petition | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ఊట్కూర్ పెద్ద చెరువు రిజర్వాయర్ గా మారుస్తున్న నేపథ్యంలో నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని ఈ రోజు ప్రజావాణిలో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్‌కు వినతి పత్రం సమర్పించారు. ఊట్కూర్ పెద్ద చెరువు ప్రస్తుతం ఉన్న నీటి సామర్థ్యంతోనే గ్రామ పరిసరాల్లో ఇండ్లు నిర్మించినందుకు పునాదులు తవ్వితే నీటి ఊట వస్తుందని పేర్కొన్నారు.

రిజర్వాయర్ గా మారిస్తే రానున్న కాలంలో పెద్ద చెరువు గ్రామానికి ముంపు నష్టం పొంచిఉంద‌ని తెలిపారు. ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించేందుకు చేపట్టిన ఎత్తిపోతల పథకంతో భూములకు సాగునీరు అందుతున్న గ్రామంలో నివసిస్తున్న ప్రజలకు ముంపు పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించక ముందు ఊట్కూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అందుకు కలెక్టర్ సిక్తాపట్నాయక్ స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చించి ఊట్కూర్ రిజర్వాయర్ ఏర్పడితే జరిగే నష్టంపై నివేదిక ఇచ్చేందుకు ప్రత్యేక కమిటీ వేసి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఊట్కూర్ మండల కేంద్రంలో కుక్కల దాడి విపరీతంగా మారడంతో పాటు చిన్న పిల్లలు పశువులపై దాడి చేస్తున్నాయని కలెక్టర్ కు మొరపెట్టుకున్నారు.

కుక్కల దాడి నుండి నియంత్రణ చర్యలు చేపట్టాలని కోరారు. ఎంపీడీవో తో మాట్లాడి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు భరత్, వార్డు సభ్యులు నరేష్, కొక్కు మల్లేష్, బీజేపీ నాయకులు బోయిని రవి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply