పెనుగొండ : ఆంధ్రప్రదేశ్ లోని కియా కార్ల కంపెనీలో భారీ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీలో దాదాపు 900 కారు ఇంజన్లు కనిపించడం లేదని యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా కంపెనీలో తయారయ్యే కార్లకు అవసరమైన విడిభాగాలు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తాయి. ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తుండగా మార్గమధ్యలో చోరీకి గురయ్యాయా లేక పరిశ్రమలోనే దొంగతనం జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
ఈ చోరీకి సంబంధించి గత నెల 19న కంపెనీ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయించారు. తొలుత ఫిర్యాదు లేకుండా విచారణ జరిపించాలని కోరగా.. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కియా కంపెనీలో కారు ఇంజన్ల చోరీపై పోలీసులు ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారని, దర్యాప్తు కూడా పూర్తయిందని సమాచారం. పోలీసు ఉన్నతాధికారులు త్వరలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.