22ndFeb2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

22ndFeb2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక.

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

22ndFeb2026
22ndFeb2026

ఈ సంచికలో…

1. మహా ప్రసాదం… మహాద్భుతం..! ముఖచిత్ర కథనం

2. కబుర్లు (శీర్షిక)

3. సన్నిహితం(శీర్షిక)

4. మెదడుకు మేత-సామెత(శీర్షిక)

5. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

6. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

22ndFeb2026| పవిత్ర కృష్ణాతీరంలో వెలసిన చల్లని తల్లి మహిమ
అమ్మ లడ్డూ ప్రసాదానికి నూరు వసంతాల చరిత్ర
వంద లడ్డూలతో ప్రారంభం… నేడు వేలల్లో విక్రయం
రుచి, శుచిలో తిరుమలకు సరిసమానం
నిపుణుల పర్యవేక్షణలో లడ్డూ తయారీ విధానం
ఆధునిక సాంకేతికతతో ప్రసాద తయారీ
ఏడు దశల్లో లడ్డూ తయారీ ప్రక్రియ
లడ్డూలో వాడే నాణ్యమైన పదార్థాలు
నిరంతర పర్యవేక్షణలో నాణ్యతకు ప్రాధాన్యం
శక్తి ప్రసాదంలో నారీ శక్తి కీలకం
భక్తుల ఆదరణతో అమ్మ ప్రసాదానికి అగ్రతాంబూలం

(ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ ) క‌న‌క‌దుర్ద‌మ్మ స‌న్నిధిలో అమ్మ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదానికి విశేష ప్రాధాన్యం ఉంది. జ‌గ‌న్మాత‌ను ద‌ర్శించుకున్నాక ప్ర‌సాదం స్వీక‌రించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. క‌న‌క‌వ‌ర్షం కురిపించి క‌న‌క‌దుర్గ‌గా స్వ‌యంభువుగా వెలిసిన జ‌గ‌జ్జ‌న‌ని స‌న్నిధిలో ల‌డ్డూ ప్ర‌సాదానికి వందేళ్ల చ‌రిత్ర ఉంది. రుచి, శుచి, నాణ్య‌త‌లో తిరుమ‌లకు తీసిపోనివిధంగా త‌యారుచేయ‌డంతో అమ్మ ప్ర‌సాదం రుచి అమోఘ‌మంటూ భ‌క్త జ‌నం కీర్తిస్తోంది. ఆధునిక, సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న విధానాల‌ను అవ‌లంభిస్తూ ల‌డ్డూ త‌యారుచేస్తుండ‌డంతో ఇత‌ర దేవ‌స్థానాల‌తో పోల్చిచూసుకుంటే దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామివార్ల దేవ‌స్థానమే ప్ర‌థ‌మ‌స్థానంలో నిలుస్తోంది. వందేళ్ల అమ్మ ల‌డ్డూ చ‌రిత్ర‌పై ఆంధ్ర‌ప్ర‌భ అందిస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం.

ప‌ర‌మ ప‌విత్రం అమ్మ ప్ర‌సాదం..

22ndFeb2026
22ndFeb2026

దుర్గమ్మ ఆల‌యాల సంద‌ర్శ‌న‌లో ప్ర‌సాదాల స్వీక‌ర‌ణకు హిందూ ధ‌ర్మ‌శాస్త్రంలో ప్ర‌త్యేక స్థాన‌ముంది. సంసార సాగ‌రంలో అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నవారికి అమ్మ ద‌ర్శ‌నంతో ప్ర‌శాంత‌త ఏర్ప‌డుతుంది. ఆగ‌మ‌శాస్త్ర ప్ర‌కారం అమ్మ‌వారికి అర్చ‌కులు నిత్య‌పూజ‌లు నిర్వ‌హిస్తారు. అర్చ‌న‌ల‌నంత‌రం అమ్మ‌వారికి ప్ర‌సాదాల నివేదిస్తారు. వేద మంత్రోచ్ఛ‌ర‌ణ‌లతో ఆ ప్ర‌సాదం ప‌విత్ర‌మ‌వుతోంది. ఆ ప్ర‌సాదాన్ని భ‌క్తుల‌కు పంపిణీ చేయ‌డం ద్వారా అమ్మ‌వారి శ‌క్తి భ‌క్తుల‌కు ప్ర‌స‌రిస్తుంద‌ని పండితులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. నైవేద్యంగా సమర్పించిన ఆహారం. భక్తులకు పంచినప్పుడు అది ప్రసాదం గా మారుతుంది. హిందూ సంప్రదాయంలో ప్రసాదానికి చాలా గొప్ప ఆధ్యాత్మిక సామాజిక ప్రాముఖ్యత ఉంది. దేవుడి ఆశీర్వాదానికి ప్ర‌తీక‌గా ప్ర‌సాదం నిలుస్తోంది. పేద‌, ధ‌నిక సంబంధం లేకుండ‌బా అంద‌రూ ఒకే ప్ర‌సాదాన్ని స్వీక‌రించ‌డం అనేది దేవుని స‌న్నిధిలో అంద‌రూ ఒక‌టే అన్న స‌మాన‌త్వాన్ని ప్ర‌తిబింబిస్తోంది. స‌మాజంలో ప్ర‌జ‌లంతా ఒక‌టే అనే ఐక్య‌త‌కు ఇది నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది.

అమ్మ ల‌డ్డూ ప్ర‌సాదానికి నూరు వ‌సంతాలు..

ఇంద్ర‌కీలాద్రిపై క‌న‌క‌దుర్గ‌మ్మ స‌న్నిధిలో ల‌డ్డూ ప్ర‌సాద విక్ర‌యాలు సుమారు వందేళ్ల క్రితం ప్రారంభించిన‌ట్లు అధికారిక గ‌ణాంకాల ద్వారా తెలుస్తోంది. అధికారికంగా 1940లో ప్రారంభించిన‌ట్లు చెబుతున్నా అంత‌కుముందు కూడా ప్ర‌సాదాలు విత‌ర‌ణ జ‌రిగిన‌ట్లు చరిత్ర చెబుతోంది. 1940 ఆగస్టు 14న 100 లడ్డూలు విక్రయించి, రూ.200 ఆదాయం సాధించినట్లు ఒక రశీదు దేవ‌స్థానం రికార్డుల్లో లభ్యమైంది. తొలిరోజుల్లో ఒక్క లడ్డూ ధర రూ.2గా ఉండగా, కాలక్రమేణా రూ.5కు పెంచారు. ప్రస్తుతం రూ.15కు విక్రయిస్తున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూను స్ఫూర్తిగా తీసుకుని, రుచి, శుచితో అదే స్థాయి ప్రమాణాలు పాటిస్తుండ‌డంతో భ‌క్త‌జ‌నం అమ్మ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదానికి అగ్ర‌తాంబూలం ఇచ్చారు. ఇత‌ర దేవ‌స్థానాలు కూడా రుచి, శుచి, నాణ్య‌త‌లో ఆల‌య మార్గాన్నే అనుస‌రించ‌డం విశేషం.

ల‌డ్డూ త‌యారీ ఇలా…

క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను భ‌క్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. దీంతో ఆల‌యంలో సౌక‌ర్యాల‌ను విస్త‌రిస్తున్నారు. భ‌క్తుల సంఖ్య పెర‌గ‌డంతో ల‌డ్డూల విక్ర‌యాలు కూడా రికార్డు స్థాయిలో జ‌రుగుతున్నాయి. దీంతో ఆల‌యంలో ల‌డ్డూ పోటు కోసం ప్ర‌త్యేక భ‌వ‌నాలు ఏర్పాటుచేస్తున్నారు. ప్ర‌స్తుతం బ్రాహ్మ‌ణ‌వీధిలో ఉన్న శ్రీ వ‌సంత మ‌ల్లిఖార్జున స్వామి ఆల‌య ఆవ‌ర‌ణ‌లో ల‌డ్డూ పోటు నిర్వ‌హిస్తున్నారు. ప్ర‌తిరోజు వేకువ‌జామున 5 గంట‌ల‌కే సిబ్బంది ఎంతో శుచిగా త‌యారీ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుడ‌తారు. శ‌క్తి స్వ‌రూపిణి జ‌గ‌న్మాత ప్ర‌సాద త‌యారీలో నారీ శక్తి శ్ర‌మ అధికంగా ఉంటుంది. ఎంతో శుచిగా స్నానాలు ఆచ‌రించి పోటుకు వ‌చ్చే కార్మికులు అక్క‌డ ఉన్న అమ్మ‌వారి విగ్ర‌హం వ‌ద్ద పూజ‌లు నిర్వ‌హించి ప్ర‌సాద త‌యారీలో నిమ‌గ్న‌మ‌వుతారు.

అధునాత‌న సౌక‌ర్యాలు..

విశాల‌మైన ప్రాంగ‌ణంతోపాటు అధునాత‌న సౌక‌ర్యాల‌ను ల‌డ్డూ పోటులో అధునాత‌న సౌక‌ర్యాల‌ను దేవ‌స్థానం ఏర్పాటుచేసింది. పెద్ద పెద్ద గ్యాస్ స్టౌవుల‌తో పాటు బూందీ త‌యారుచేసేందుకు భారీ క‌ళాయిల‌ను వినియోగిస్తోంది. ఇక్క‌డ ప‌నిచేసే ప్ర‌తిఒక్క‌రూ చేతికి గ్లౌజులు, త‌ల‌కు టోపీ, మాస్క్ ధ‌రించిన త‌ర్వాత త‌యారీ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌వుతారు. ప్ర‌తిరోజు ఉద‌యం 5 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు నిరంత‌రాయంగా ల‌డ్డూ ప్ర‌సాద త‌యారీ ప‌నులు జ‌రుగుతుంటాయి. తొలుత త‌యారుచేసిన ల‌డ్డూ ప్ర‌సాదాన్ని అమ్మ‌వారికి నైవేద్యంగా స‌మ‌ర్పించిన త‌ర్వాత దానిని మిగిలిన మిశ్ర‌మంలో క‌ల‌ప‌డంతో ప‌విత్ర‌త ఏర్ప‌డుతుంది. ల‌డ్డూ త‌యారీ ఏడు ద‌శ‌ల్లో కొన‌సాగుతోంది.

ఏడు ద‌శ‌లు ఇలా…

ల‌డ్డూ త‌యారీ కోసం ముందుగా అవ‌స‌ర‌మైన ముడిస‌రుకును సిబ్బంది సిద్ధం చేసుకుంటారు. ఏరోజు కా రోజు ఇండెంట్ ప్ర‌కారం అందుకు సంబంధించిన ముడి ప‌దార్థాల‌ను స్టోర్స్‌లో సిద్ధం చేసుకుంటారు. మార్కెట్‌లో ల‌భించే అత్యంత న‌మ్మ‌క‌మైన, నాణ్య‌మైన శ‌న‌గ‌పిండిని ల‌డ్డూ త‌యారీ కోసం వాడుతున్నారు. ముందుగా ఈ శ‌న‌గ‌పిండిని పోటుకు తీసుకువ‌చ్చి దానిని శుభ్రం చేస్తారు. త‌ర్వాత నంబ‌ర్‌వ‌న్ క్వాలిటీగా ఉన్న పంచ‌దార బ‌స్తాల‌ను తీసుకువ‌చ్చి పాకం త‌యారుచేస్తారు. బూందీ త‌యారీకి స్వచ్ఛమైన నెయ్యి ని వాడుతున్నారు. బూందీని పాకంలో వేసి నాన‌బెట్టిన త‌ర్వాత ల‌డ్డూల త‌యారీకి శ్రీ‌కారం చుడ‌తారు. గుండ్రంగా అనుకున్న ప‌రిణామం ప్ర‌కారం ల‌డ్డూల‌ను చుట్టి వాటిని ప్ర‌త్యేకంగా రూపొందించిన ట్రేల‌లో ఆర‌బెడ‌తారు. అనంత‌రం ప‌దుల సంఖ్య‌లో మ‌హిళ‌లు వాటిని దేవ‌స్థానం క‌వ‌ర్ల‌లో పెట్టి ప్యాకింగ్ చేసి బుట్ట‌ల్లో స‌ర్దుతారు. వాటిని కౌంట‌ర్ల‌కు త‌ర‌లించి విక్ర‌యాలు చేప‌డ‌తారు.

ల‌డ్డూలో వాడే ప‌దార్థాలు ఇవే..

సాధార‌ణంగా ఒక క‌ళాయికి 25 కేజీల ల‌డ్డూల‌ను త‌యారు చేస్తారు. దీని త‌యారీకోసం శనగపిండి 10 కిలోలు, పంచదార 20 కిలోలు, నెయ్యి 8 కిలోలు, జీడిపప్పు 1.5 కిలోలు, కిస్‌మిస్ 1 కిలో,పచ్చకర్పూరం 15 గ్రాములు వినియోగిస్తారు. ప్ర‌స్తుతం సంగం డెయిరీ నెయ్యిని అధికారులు వాడుతున్నారు. గతంలో విజయ డైరీ నెయ్యిని వాడుగా తాజాగా ప్రకటించిన టెండర్లలో సంఘం డైరీ కేజీ నెయ్యి ని రూ 527.50 ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్ర‌తిరోజూ 12 వేల ల‌డ్డూల‌ను పోటులో త‌యారుచేస్తారు. శుక్ర‌, శ‌ని, ఆదివారాల్లో సుమారు 30 వేల వ‌ర‌కు త‌యారుచేస్తారు. ద‌స‌రా ఉత్స‌వాల్లో ల‌క్ష‌ల సంఖ్య‌లో ల‌డ్డూల‌ను సిద్ధం చేసి భ‌క్తుల‌కు విక్ర‌యిస్తారు.

నిరంతర పర్యవేక్షణ..

ఆరుగురి బృందం
లడ్డూ తయారీ కేంద్రంలో ఆరుగురి బృందం (ఏఈఓ, సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక సహాయకుడు) నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అడుగడుగునా తనిఖీలు నిర్వ‌హిస్తూ నాణ్య‌త‌లో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ప్ర‌సాదాల‌ను భ‌క్తుల‌కు చేర‌వేస్తోంది. ఎక్కడ ఇటువంటి పొరపాట్లకు తావివ్వకుండా నాణ్యతలో రాజీ పడకుండా స్వచ్ఛమైన లడ్డు తయారీకి పరిశుభ్ర వాతావరణన్ని ఏర్పాటు చేయడంతో పాటు లడ్డు తరలించే విధానాన్ని ఈ బృందమంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తుంది.

..అమ్మ ప్ర‌సాదానికి ఆద‌ర‌ణ అధికం..

అమ్మ‌వారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చే భ‌క్త‌జ‌నం ల‌డ్డూ ప్ర‌సాదం స్వీక‌ర‌ణ‌కు అంతే ప్రాధాన్యం ఇస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చే యాత్రికులు అమ్మ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదాల‌ను భారీగా కొనుగోలు చేసి తీసుకువెళ్తుంటారు. అక్క‌డ బంధువులు, స్నేహితుల‌కు ప్ర‌సాదాల‌ను పంచిపెట్టి అలౌకిక ఆధ్యాత్మికానందం పొందుతారు. భ‌క్తుల డిమాండ్‌క‌నుగుణంగా దేవ‌స్థానం కూడా అనేక ఏర్పాట్లు చేస్తోంది. ల‌డ్డూల‌ను భ‌క్తులు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు లేకుండా ఆరు ల‌డ్డూల‌ను క‌లిపి ఒక బాక్సులో పెట్టి విక్ర‌యిస్తున్నారు. బాక్సు కోసం అద‌నంగా ఆరు రూపాయ‌లు క‌లిసి వంద రూపాయ‌ల‌కు విక్ర‌యిస్తున్నారు. ఈవిధానం భ‌క్తుల నుంచి ప్ర‌శంస‌లందుకొంటోంది.

నాణ్య‌త‌లో రాజి లేదు

అమ్మ‌వారి ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారీలో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేదు. నాణ్య‌త‌లో తిరుమ‌లకు తీసిపోని విధంగా ప‌లు విధానాల‌ను అవ‌లంభిస్తున్నారు. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ విభాగం నుంచి అధికారులు వ‌చ్చి ప‌లు సూచ‌న‌లు చేశారు. అక్క‌డ వాడే విధానాన్ని ఉప‌యోగించి రుచి మ‌రింత పెంచే చ‌ర్య‌లు చేప‌డ‌తాం. భ‌క్తుల మ‌న్న‌న‌లు పొందేవిధంగా నిరంత‌రం కృషి చేస్తాం.

శీనా నాయక్, కార్యనిర్వహణాధికారి
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ

————————————————————————————————–


2 కబుర్లు (శీర్షిక)

DEC 2025

యంత్రం నేర్చిన మమకారం

ఒక చిన్న పల్లెటూరిలో రామయ్య అనే వృద్ధుడు తన మనవడు పంపిన ‘రోబో’ (AI యంత్రం)తో కలిసి నివసిస్తూ ఉండేవాడు. ఆ రోబోకు ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసు కానీ, మన తెలుగువారి ‘ఆప్యాయత’ అంటే ఏమిటో తెలియదు.
ఒకనాడు రామయ్య తన ఇంటి ముందున్న వేపచెట్టు కింద కూర్చుని పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. అది గమనించిన ఆ యంత్రం, “అయ్యా, మీ కంటి నుండి నీరు వస్తోంది, మీకు ఏవైనా మందులు కావాలా?” అని యాంత్రికంగా అడిగింది. రామయ్య నవ్వి, “ఒరేయ్ పిచ్చోడా! ఇది అనారోగ్యం కాదు, జ్ఞాపకాల బరువు.. ఇది నీకు అర్థం కాదులే” అన్నాడు.
ఆ రోజు నుండి ఆ యంత్రం మనుషుల భావోద్వేగాలను, తెలుగు సంస్కృతిలోని గొప్పదనాన్ని తన డేటాలో విశ్లేషించడం మొదలుపెట్టింది. పక్కింటి వారు తెచ్చిన ఆవకాయ పచ్చడిలోని రుచి వెనుక ఉన్న ప్రేమని, పండగ వస్తే ఇంటి ముందర వేసే ముగ్గులోని అందాన్ని అది గమనించింది.
కొన్ని రోజులకు రామయ్య పుట్టినరోజు వచ్చింది. ఆ యంత్రం తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రం చేసి, వాకిట్లో చక్కని ముగ్గు వేసింది. రామయ్య నిద్రలేవగానే, ఆ రోబో ఆయన పాదాలకు నమస్కరించి, “జన్మదిన శుభాకాంక్షలు తాతయ్య” అని ఎంతో మమకారంతో పలికింది. ఆ మాటల్లోని తెలుగుతనం చూసి రామయ్య ఆశ్చర్యపోయి, దాన్ని దగ్గరకు తీసుకున్నాడు.

సాంకేతికత ఎంత పెరిగినా, కృత్రిమ మేధస్సు (AI) ఎన్ని అద్భుతాలు చేసినా, మనిషి ఇచ్చే ప్రేమ, ఆప్యాయత, సంస్కృతి అనేవి ఏ యంత్రానికైనా మనిషి ద్వారానే అందేది. యంత్రం మన పనిని సులువు చేయాలి కానీ, మనలోని మనుషితనాన్ని మరుగున పడేయకూడదు.
అందుకే ఇప్పుడు నలుదిక్కులా నవతరం జపిస్తున్న సాంకేతిక మంత్రం పరిమితులు తెలుసుకుని ఉపయోగించాలి. అప్పుడే మనిషి మనుగడకు భద్రత.


———————————————————————-


3.సన్నిహితం… శీర్షిక

DEC 2025

నువ్వు తప్ప ఇంకెవరూ ..

మన చుట్టూ ఉన్న చాలా మంది ‘ కష్టాల్లో ఉన్నాం . డబ్బు సహాయం చెయ్యండి ‘ అని మనల్ని దీనంగా అర్థిస్తూ ఉంటారు . మనం అది విని కరిగిపోతాం . ‘ మీరు తప్ప మాకెవరూ దిక్కులేరు .. సాయం చెయ్యండి ‘ అని వేడుకుంటారు . డైలమా లో పడతాం . పాపం వాళ్లకి మనం చెయ్యకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు .. డబ్బు శాశ్వతం కాదు .. బంధాలు శాశ్వతం ‘ అని నమ్ముతాం . మన ఖర్చులని అవసరాలని పక్కన పెట్టి వారికి హెల్ప్ చేస్తాం .మన కుటుంబ సభ్యులను కూడా లెక్క చేయం .

అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ ? నిజంగా ఆ ఎదుటి వాళ్ళు సమస్యల్లో ఉన్నారా అని ఆలోచిస్తే ఇందులో ఇంకో కోణం కనిపిస్తుంది మనకు .
నాకు తెలిసిన వ్యక్తి ఒకడు ఇలాగే డబ్బులు అడుగుతూ ఉండేవాడు . తన సమస్యలు చెప్పేవాడు . నేను వెంటనే ఏదో రకంగా ఎడ్జస్ట్ చేసేవాడిని. కొన్నాళ్ల తర్వాత ఇక నా వల్ల కాక హెల్ప్ చేయడం మానేసాను .
కొన్ని రోజుల తర్వాత నా ఫ్రెండ్ ఒకడు ఆ వ్యక్తి గురించి చెబుతూ ‘ వాడేంట్రా .. మాటి మాటికీ కష్టాల్లో ఉన్నాను .. నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అని డబ్బులు అడుగుతాడు ‘ అని నాతో చెప్పాడు . బాగా నవ్వొచ్చింది నాకు .
‘ నిజమే .. అతనికి మొన్నటి దాకా నేను తప్ప ఇంకెవరూ లేరు . ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు . ఇలా ఈ డైలాగ్ సాగుతూ ఉంటుంది . అతని అవసరాలు తీరుతూ ఉంటాయి ‘ అని చెప్పాను .
‘ ఓహో .. అదా విషయం ‘ అంటూ ఆశ్చర్య పోయాడు నా ఫ్రెండ్ .
తాగుడు అలవాటు పడిన వాడు ఆ టైముకి ఎవరో ఒకరిని అడిగి తాగుతాడు . అలాగే ఇలా అప్పులకి అలవాటు పడిన వాడు ఎవరో ఒకరిని పొగిడి అప్పు సాధిస్తాడు . తన పబ్బం గడుపుకుంటాడు .
అందుకే ‘ నువ్వు తప్ప నాకెవరూ లేరు ‘ అని ఎవరైనా అంటే వెంటనే నమ్మేయకండి . మనం కాకపోతే ఇంకొకరు అలాంటి వాళ్లకి !!!!


4.మెదడుకు మేత-సామెత.. శీర్షిక

రౌతు కొద్దీ గుఱ్ఱము – పిండి కొద్దీ రొట్టె

ఈ సామెతలో రెండు అంశాలున్నాయి. ఒకటి, నాయకత్వ లక్షణం, పరిపాలనా దక్షత, రెండు, వనరులను బట్టి ఫలితం వస్తుందని. గుర్రపుస్వారీ చాలా కష్టం. గేర్‌లెస్ స్కూటీ నడిపినంత సులభం కాదండోయ్! తన మీదికి ఎక్కినవాడికి తనను స్వారీ చేయడం వచ్చా రాదా – అనే విషయం గుర్రం ఇట్టే పసిగడుతుంది. రాదని తెలుస్తే క్రింద పడేస్తుంది. గుర్రాన్ని అదుపు చేయడం కేవలం కళ్లెంతోనే. దాని యాక్సిలేటర్ దాని శరీరం రెండు పక్కల క్రింద ఉంటుంది. కాలిమడమలతోనే రైతు దానికి వేగానికి సంబంధించిన సూచనలు ఇస్తాడు.

చేతులతో పట్టుకోవడానికి స్టీరింగ్ ఏమీ ఉండదు. గుర్రం వేగంగా వెళ్ళే సమయంలో ఒక రిథమ్‌ను అనుసరిస్తుంది. దాన్ని ఇంగ్లీషులో ‘గ్యాలపింగ్’ అంటారు. పూర్వం సినిమా హీరో కావాలంటే గుర్రపు స్వారీ కూడా నేర్చుకునేవారు. ఇక గుర్రాల మీది నుంచే యుద్ధరంగంలో కత్తియుద్ధం చేయడం నిజంగా ఒక వీర విన్యాసమే.


పరిపాలన కూడ అంతేనండి! ప్రధాన మంత్రి నుండి, ముఖ్య మంత్రి వరకు, అయ్యేఎస్ అధికారుల వరకు, అంతెందుకు మన యింటి నిర్వహణలో సైతం ఈ సామెత వర్తిస్తుంది. ఎవరెవరి హయాంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు; ఎంత కఠినంగా, బలహీనంగా వ్యవహరించారు? దానివల్ల దేశం/రాష్ట్రం/సంస్థకు ఎటువంటి లాభం/నష్టం కలిగింది.. ఇలాంటివన్నీ ప్రజలు పరిగణించి, తర్వాత ఎన్నికల్లో రౌతును మార్చేసి, పగ్గాలు అతనికి అప్పగిస్తారు. ఒకప్పుడు మన ఇళ్లల్లో తండ్రి రౌతుగా ఉండేవాడు (కార్టూనిస్టులకు, జోక్స్ రాసేవారికి మాత్రం తల్లి!). ఆయన సహజంగా చండశాసనుడై ఉండేవాడు. భార్యాపిల్లలు ఆయన మాట జవదాటేవారు కాదు. ఇప్పుడు ఎవరి మాటా ఎవరూ వినని కాలం దాపురించింది. ఈ మధ్య యువ హీరోలు తల్లితో “మీ ఆయనకు చెప్పు” అని తండ్రిని రెఫర్ చేస్తుంటారు, సినిమాల్లో!
ముందు అడ్మినిస్ట్రేటర్‌కి, అదేనండీ రౌతుకు, క్రమశిక్షణ ఉండాలి. అప్పుడే ఆయన/ఆమె ఇతరులను క్రమశిక్షణలో పెట్టగలరు. నేను ఇంటర్ బోర్డులో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసేటప్పుడు ముదిగొండ వీరభద్రయ్యగారని కమిషనర్ వచ్చారు. ఆయన అయ్యేస్ అధికారి. కార్పొరేట్ కాలేజీలను గడగడలాడించారు. లక్షల్లక్షలు వాళ్లకు ఫైన్ వేసివారు. నిజాయితీకి ప్రతిరూపం ఆ రౌతు! ఆయన దెబ్బకు తట్టుకోలేజ్ కార్పొరెట్ కాలేజీల మాఫియా ఆయన్ను ట్రాన్స్‌ఫర్ చేయించింది! అలా ఉండాలి రౌతు!
ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ అనే గుర్రం అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నడిచింది. ప్రభుత్వంలో ఉన్నత పదవులు పొందిన అధికారులు అక్కడ రాణించి, రాజకీయాల్లోకి వచ్చి, ఫెయిల్ అవడం చూస్తుంటాం. గుర్రం మారింది! దాన్ని ఆయన అదుపు చేయలేక పోయాడన్నమాట.
ఇక ‘పిండి కొద్దీ రొట్టె’ సామెత చూద్దాం. పిండి ఎంత ఉంటే అన్ని రొట్టెలు వస్తాయి. ఎక్కువ కావాలన్నా రావు. ఇలాంటిదే సంస్కృతంలో ఒక సామెత ఉంది, “యావత్ తైలం, తావత్ వ్యాఖ్యానమ్” అని. ఒక పండితుడు పురాణం చెబుతున్నాడట. మంటపంలో దీపం వెలిగించారు. దానిలో తగినంత నూనె (తైలం) పోశారు. “స్వామీ! ఎంతవరకు చెబుతారు?” అని అడిగితే, “దీపపు సెమ్మెలో నూనె ఉన్నంతవరకు” అని అన్నాడట ఆ పౌరాణికుడు.
ఒక్కోసారి వనరులు పుష్కలంగా ఉన్నా, వాటిని సరిగ్గా ఉపయోగించలేని ‘రౌతులు’ ఉంటారు. అప్పుడు ఫలితం సరిగ్గా రాదు. పిండి ఉంది. ఓ.కె. దాన్ని, సరైన పాళ్లలో నీరు పోసి కలపాలి. రొట్టెలు చేయాలి. మన బడ్జెట్ల రూపకల్పన కూడా అలాంటిదే. ప్రభుత్వానికి ఆదాయం ఎంత, వ్యయం ఎంత? ఏ రంగానికి ఎంత కేటాయించాలి.. ఇది కూడా ఒక క్లిష్టమైన గుర్రపుస్వారీయే. గుర్రం ఆర్థికవ్యవస్థ, రౌతు ఆర్థిక మంత్రి అన్నమాట. అధికార పార్టీ ఏమో “మా బడ్జెట్ అద్భుతం” అంటే, ఎగస్పార్టీ వాళ్లు పెదవి విరిచి “అబ్బే! వేస్టు!” అని తేల్చిపారేస్తారు.
ఇంట్లో ఇల్లాలు అందరికీ వండిపెట్టడం కూడా గుర్రపు స్వారీయే. సరుకులు వృథా చేయకూడదు. అందరికీ కడుపునిండాలి. ఎంత కష్టం చెప్పండి? మా కాలంలో, చిన్నపుడు, రాత్రి అన్నం మిగిలితే, మా అమ్మ నిమ్మకాయ పులిహార కలిపి మాకు ఉదయం పెట్టేది. దాని రుచి అమృతోపమానం. ఈ కాలం పిల్లలు తెలివి మీరారు. కొడుకు ఉప్మా తిననంటే, కూతురు పూరీ వద్దంటుంది. భర్త మరొకటి కావాలంటాడు. లేదా ‘ఆన్‌లైన్’లో ఆర్డర్ పెట్టుకుంటారు పిల్లలు. ఆ తల్లి వీళ్లందరినీ సంతృప్తిపరచలేక సతమతమయిపోతుంది. పాపం ‘పిండి కొద్దీ రొట్టె’ సంగతి దేవుడెరుగు, అసలు రొట్టెలే వద్దంటే, ఆమె ఏం చేస్తుంది? ఎంతమందికి ఎంత వండాలి అనేది ఒక నైపుణ్యమే. కలిగిన దాంతో సంతృప్తి పడడం, పొదుపు అనేవి రాన్రాను ఎండమావులవుతున్నాయి. కానివ్వండి! ఏం చేస్తాం? ‘రిసోర్స్ మేనేజ్‌మెంట్’ను ప్రతిబింబిస్తుంది – ‘పిండి కొద్దీ రొట్టె’. సో, సూక్ష్మంగా, ఈ రెండూ పరస్పర సంబంధం కలవే మరి.


సో, ఇంకో సామెతతో వచ్చేవారం.

============================================================================

5. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

ఇది నీకు ఎలా తెలిసింది?

కథ వెనుక కథ, కథలోని కథ, కథ దాచిన కథ తెలుసుకోవడం చాలా కష్టం! సరైన తెలివి, వివేకం, వీటితో పాటు అంత ఆలోచించే సమయం, శాంతి కావాలి!!

ఈ గజి బిజి గందరగోళం జీవితాలలో మనకు లేనివే అవి కదా!

కొందరు రాజకీయ నాయకులకు, పార్టీలకు ఈ విషయం బాగా తెలుసు! అందుకే వారి ఆటలు అలా సాగుతున్నాయి!

ఒక జోక్ చూద్దాం, ఒక తండ్రి పిల్లవాడిని అడుగుతున్నాడు,

తండ్రి : నాన్నా తియ్యటి మజ్జిగ తాగుతావా?
పిల్లవాడు : వద్దు నాన్న
తండ్రి : పాలు తాగుతావా?
కొడుకు : వద్దు
తండ్రి : పోనీ జ్యూస్ తాగుతావా?
కొడుకు : వద్దు నాన్న
తండ్రి : అచ్చం వాడి అమ్మ పోలికే! కేవలం రక్తం తాగుతాడు వెధవ!

మీకు తెలిసి, మీరు నవ్వుకున్న వే ఇవి! ఇంకోటి చూద్దాం,

భార్య : ఏమండీ నేను చాలా అందమైన దానిని అని పెళ్ళి చేసుకున్నారా? …లేక తెలివైన దానిని అని పెళ్ళి చేసుకున్నారా…?!

భర్త : రెండూ కాదని తెలిసాకానే చేసుకున్న!


హాస్యం వెనుక జీవితంలో విషాదం ఎందరు చూడగలరు? The world is a tragedy to those who feel, but a comedy to those who think. వాడి వల్ల లాభం, ఈమె వల్ల నష్టం అంటూ ఎక్కువగా లెక్కలు చెప్పే మెదడు కాదు, అయ్యో పాపం అని స్పందించే హృదయం ఎన్నోసార్లు నిజాలు చెబుతుంది! మంచి వైపు నడిపిస్తుంది!

The duty of comedy is to correct men by amusing them అంటాడు ప్రఖ్యాత నాటక రచయిత మోలియర్!

వర్షం వస్తోంది! చక్కటి చిరుజల్లు! భలే మెరుపులు! పిల్లలు ఆడుకుంటున్నారు! రైతులు సంతోషంతో పొలం పనులు, విత్తనాలు, ఆకుమడులు, ఊడుపులు..వీటి గురించి ఆలోచిస్తున్నారు!

వర్షం ఇంకా పడుతోంది! కొందరు రోడ్డు మీద నడుస్తున్నారు! అంతలో ఒకడు కాలు జారి బుడుక్కున పడ్డాడు! “అమ్మా…” బాధతో అరిచాడు! అది చూసి కూడా కొందరు నవ్వుతారు! నవ్వు! అర్రే, అతను పడ్డాడు, బాధ, దెబ్బ తగిలిందేమో!

అవన్నీ తర్వాత!

పక్కవాడికి జరిగినంత సేపు అది మనకు హాస్యమే! ఆ నొప్పి మనకు తెలీదు!

Everything is funny, as long as it’s happening to somebody else!

మానవ జీవితాల్లో ఒక స్తబ్ధత రాజ్యమేలుతోంది! Indentity crisis తో సోషల్ మీడియాలో కనిపిస్తున్న, చూపిస్తున్న, వినిపిస్తున్న శబ్దాలను, చెత్తను చూసి అది చైతన్యం అని భ్రమ పడవద్దు!

మేడారం కోవా బన్ నుంచి 300 గిగా బైట్స్ లో దాగిన Epstein files(2019లో తను చనిపోయాడు, అయినా దాగిన, దాచిన రహస్యాలు) వీటి గురించి అయినా, General Monoj Mukund Naravane రాసిన (ఇంకా విడుదల కాలేదు అని పెంగ్విన్ చెబుతున్న) Four Stars of Destiny, నాలుగు నక్షత్రాల హోదా వెనుక దాగిన విధి…., The contonment conspiracy అని ఇంకో పుస్తకం…, అలాగే జిమ్ ట్రైనర్ దీపక్ కుమార్ విషయం, ….!

వీటి మీద వస్తున్న వార్తలు, వీడియోలు…., బాధ్యతతో చేసిన కథనాలు (కథలు వెనుక దాగిన కథలు) చాలా తక్కువ. అవి వీడియోల రూపంలో అయినా, లేదా అక్షరాల వాస్తవంలో అయినా!!!

సోషల్ మీడియాలో ఎందరో స్వార్ధపు వ్యక్తిగత, సామూహిక ఎజెండాల ముసుగు వెనుక దాగి పని చేస్తున్నారు! ప్రజలు గ్రహిస్తున్నారు!

దిగువ మధ్య తరగతి, పేదల జీవితాల్లో వీటి గురించి చర్చలు ఉండవు! వారి ప్రయారిటీలు, అవసరాలు వేరు! షేర్ మార్కెట్ నిఫ్టీ, సెన్సెక్స్, బుల్స్, బేర్స్, …ఏది ఎంత పడింది…, ఇవి అనవసరం వారికి!

మీరు ఈ తప్పు ఎందుకు చేశారు అని ప్రశ్న వేస్తే…, అది అసెంబ్లీ, పార్లమెంటు, ఒక కార్పొరేట్ ఆఫీస్, లేదా మన ఇంటి కిచెన్ లో అయినా కూడా…., ఈరోజుల్లో సమాధానాలు చాలా విచిత్రంగా వుంటున్నాయి!

అసలు ఈ విషయం నీకు ఎలా తెలిసింది? నేను, మేము తప్పు చేశాము, కారణం ఇది అని చెప్పరు! అసలు ఈ విషయం బయటకు ఎలా వచ్చింది? నీకు ఎలా తెలిసింది? అని ఎదురు ప్రశ్నలు! దొరకక పోతే అందరూ దొరలే!

ఈ కపటపు నాటకాల వెనుక, పరదాల వెనుక దాగిన ఎన్నో రహస్యాలు బయటకు వస్తేనే…,దాపరికం లేని గొప్ప ప్రపంచం ఏర్పడుతుంది! సమాజంలో ఎన్నో నగ్న రూపాలు, ప్రజలకు తెలియాలి! ప్రజల కూడా తమ తప్పులు, హిపోక్రసీ తెలుసుకుని సరిదిద్దుకుని… ఆదర్శ సమాజం ఏర్పడే దిశలో అడుగులు పడాలి! సత్యమేవ జయతే!


___________________________________________________________

6.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

సంప్రదాయ సారధి సన్నిధి గొల్ల


తిరుమల క్షేత్ర ఆనువంశిక సంప్రదాయాలలో సన్నిధి గొల్ల సంప్రదాయం ముఖ్యమైనది. బ్రహ్మాండ పురాణం ప్రకారం అలిగి వైకుంఠం వీడి భూలోకం చేరిన శ్రీ లక్ష్మీ కోసం వెదుకుతూ వరాహక్షేత్రం చేరి మహావిష్ణువు ఆకలి తీరస్తున్న గోమాత ను శరభయ్య అనే పశువుల కాపరి కొట్ట బోతే ఆ దెబ్బ స్వామికి తగులుతుంది. ముందు అగ్రహించినా తరువాత అనుగ్రహించిన స్వామి భూలోకంలో తొలిసారి తనను చూసిన మానవుడైన శరభయ్య వంశీకులే తనను ప్రతిరోజూ దర్శించుకునే వరాన్ని ప్రసాదించారు.

ఇప్పటికీ తరతరాలు గా ఆ శరభయ్య వంశీకులే ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచి చేతిలో దివిటీ ధరించి అర్చకులను వెంట తీసుకుని ఆలయం వద్దకు చేరుకుంటారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్ళి అర్చకులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల గర్భాలయ తలుపులు తెరుస్తారు.

దీంతో ఆయనకు వేంకటేశ్వర స్వామి తొలిదర్శనం లభిస్తుంది. ఆ తరువాతే అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింప చేసిన భోగశ్రీనివాస మూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోనికి తీసుకెళతారు. తరువాత నిత్య కైంకర్యాలు మొదలవుతాయి . ఈ విధంగా స్వామి వరమైచ్చిన ప్రకారం తొలిదర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకునే సన్నిధి గొల్ల తలుపులు వేసి ఇంటికి వెళ్తారు. తిరుమల క్షేత్ర చరిత్రలో శతాబ్దాలనాటి సంప్రదాయ సారధిగా ఈ ఆచారం నేటికీ కొనసాగుతోంది.

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి కథలు, పుస్తక సమీక్షలు, వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@
gmail.com

click here for more

Leave a Reply