సైబర్ మోసగాళ్ల ఆటకట్టు..

సైబర్ మోసగాళ్ల ఆటకట్టు..
- ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0తో చెక్..
- 137 కోట్ల లావాదేవీలు.. 24 మంది నిందితులు..
- 13 మంది నిందితుల అరెస్ట్
- కరీంనగర్ సీపీ గౌస్ అలాం
కరీంనగర్ క్రైమ్, ఆంధ్రప్రభ : ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0 ద్వారా సైబర్ మోసగాళ్ల ఆటకట్టించారు కరీంనగర్ పోలీసులు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలాం ఆధ్వర్యంలో క్రాక్డౌన్ 1.0 పేరుతో ప్రత్యేకమైన మిషన్ ను ఏర్పాటు చేసి.. సైబర్ నేరాలకు అవకాశం ఉన్న బ్యాంకు అకౌంట్లను క్షుణ్ణంగా పరిశీలించేలా ప్రత్యేకమైన బృందాన్ని నియమించారు. ఎప్పటికప్పుడు సిపి స్వయంగా పర్యవేక్షిస్తూ ఈ బృందంతో కలిసి ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రత్యేక ఆపరేషన్లో భాగంగా 24 మందిని గుర్తించగా, వీరిలో 13 మందిని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు సిపి గౌస్ అలం ప్రకటించారు.
ఈ సందర్భంగా కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. అత్యంత కీలకంగా మారిన సైబర్ క్రైమ్ నేరాలు పసిగట్టడంలో కరీంనగర్ పోలీసులు తమ దైన శైలిలో పనిచేస్తున్నారు. కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల్ గౌడ్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ లావాదేవీలకు పాల్పడుతున్న 24 మంది నిందితులను గుర్తించారు. ముఖ్యంగా రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ సైబర్ క్రైమ్ లావాదేవీలో ప్రముఖ పాత్ర పోషించినట్లు తెలిపారు. దీనికి బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్ సహకరించినట్టు వెల్ల డైందన్నారు. బ్యాంకు క్యాషియర్ గా పనిచేస్తున్న ఆయేషా బేగం పాత్ర కూడా ఉందని తెలిపారు.

మొత్తంగా రత్నాకర్ లిమిటెడ్ బ్యాంకు 125 కోట్ల 80 లక్షలు పైగా లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. కోపరేటివ్ సొసైటీ నుండి కూడా 12 కోట్ల 25 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో బండారి సాయిరాం, ఆనుమాన్ల రంజిత్, అలిగేటి మల్లేశం, భోగ రాకేష్, బండి ప్రణయ్, జగిత్యాలకు చెందిన విభూది రామ్ కుమార్, నాతర్ల శ్రీనివాస్, కర్రె రాజు, కల్లెడ మహేందర్, కొండ్ర నరహరిలున్నారు. రత్నాకర్ బ్యాంక్ మేనేజర్ భువనగిరి కళ్యాణ్, బ్యాంకు క్యాషియర్ ఆయిషా బేగం లను అరెస్టు చేయగా, అల్లే సత్యం అనే నిందితుడు ఇదే తరహా కేసుల్లో నిందితునిగా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ జైల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు.
అయితే ఇందులో కొందరు నిందితులు విదేశీ వ్యక్తులతో సంబంధాలున్నట్లు గుర్తించామని, వారిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని సిపి తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవాల్సి ఉందని, త్వరలోనే పట్టుకుని నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. సైబర్ క్రైమ్ లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుమల గౌడ్, ఎస్సైలు చేరాలు, శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు అభినవ్, ప్రశాంత్, సాయి, ఫరీద్, నరేష్, రమణమూర్తి, రాకేష్, సింధు, సురేందర్ ను సీపీ ప్రశసించారు. ఈ సమావేశంలో కరీంనగర్ ఏసిపి వెంకటస్వామి, సీఐలు రామచంద్రరావు, సుజన్ రెడ్డి, సరిలాల్లు పాల్గొన్నారు.
