11 crore | సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదు..

11 crore | సహకార వ్యవస్థలో రాజకీయాలు ఉండకూడదు..

  • ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే వారుండాలి..
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో పాడిపరిశ్రమది గొప్ప పాత్ర..
  • పాడి రైతులకు విలువ జోడింపులో శిక్షణ ఇవ్వాలి..
  • భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు స్పష్టీకరణ..
  • విజయా డైరీ ది అద్భుత ప్రస్థానమని అభినందన…
  • విజయ పాలు తల్లిపాలు కంటే కమ్మనైనవి…

11 crore | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్యంలో సహకార వ్యవస్థ చాలా గొప్పదని, అందులో రాజకీయాలు ప్రవేశించకూడదని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు(Muppavarapu Venkaiah Naidu) స్పష్టం చేశారు. ఈ రోజు ఆయన కృష్ణాజిల్లా వీరవల్లిలో కృష్ణా మిల్క్ యూనియన్ కామథేను మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో నూతనంగా నిర్మించిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహా ఆవిష్కరణ, జాతీయ దినోత్సవం, పాడి రైతులకు 11 కోట్ల రూపాయలు(11 crore rupees) బోనస్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సహకార వ్యవస్థ చాలా మంచిదని, అయితే సహకార వ్యవస్థలో రాజకీయాలు ప్రవేశించకూడదన్నారు. రాజకీయాలు ప్రవేశిస్తే ఈ వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారుండాలన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్(Krishna Milk Union) రాజకీయాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిపి పాల ఉత్పత్తిని పెంచుతూ ఆ ఉత్పత్తి సాధించిన లాభాలను రైతులకు పంచుతూ విజయాల బాటలో నడుస్తోందని అభినందించారు.

ఈ సందర్భంగా దేశంలో క్షీర విప్లవానికి నాందిపలికిన వ్యక్తి, పాలసహకార సంఘాలకు బీజం వేసిన వ్యక్తి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అని గుర్తుచేస్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్(Jammu and Kashmir)లో 370 అధికరణం రద్దు చేసిన ఘట్టాలను వెంకయ్యనాయుడు గుర్తు చేసుకున్నారు.

370 అధికరణం రద్దు తీర్మానం ముందుగా రాజ్యసభలో ఆమోదం పొందిందని, నాడు తాను భారత ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ ఛైర్మన్ గా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. బీజంతో గత పాతికేళ్ళలో భారతదేశంలో హరిత విప్లవాన్ని మించి క్షీర విప్లవం అభివృద్ధి చెందినట్లు నీతిఆయోగ్ వెల్లడించిందని, 1990లో అమెరికా పాల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉండగా ప్రస్తుతం దాన్ని భారత్(India) అధిగమించిందని వెంకయ్యనాయుడు చెప్పారు.

2050 నాటికి అమెరికాలో ఉత్పత్తి అయ్యే పాలకు రెట్టింపు పాలను భారత్ ఉత్పత్తి చేస్తుందన్న అంచనా పాడిరైతులకు బలాన్ని, భరోసాను అందిస్తుందన్నారు. పాలసహకార సంఘాలు గ్రామీణ ఆర్థికవ్యవస్థకు బలమైన ఊతంగా ఉన్నాయని, మన దేశ జనాభాలో అత్యధిక భాగం గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారన్నారు.

అందుకే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయితేనే, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. వ్యవసాయం ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల వల్ల నష్టాలు తెచ్చినా, పాడి పరిశ్రమ(Dairy Industry) అనేది రైతు కుటుంబాలకు నిత్యం, నికరమైన ఆదాయాన్ని అందిస్తుందన్నారు. ఆ మధ్య రైతు ఆత్మహత్యల నేపథ్యంలో హైదరాబాద్ లోని మేనేజ్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్ టెన్షన్ మేనేజ్ మెంట్) ఒక పరిశోధన చేసిందని,దీని ప్రకారం పాడి ఉన్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడలేదని, అంటే వ్యవసాయానికి దన్నుగా రైతులు ఇలాంటి అదనపు ఆదాయ మార్గాల మీద దృష్టి కేంద్రీకరిస్తే సమస్యలు ఉండవన్నారు.

ఇక్కడ మనందరికీ తెలియాల్సిన మరో అద్భుతమైన విషయం ఏమిటంటే… దేశంలో వ్యవసాయ రంగం ఆదాయంలో నాలుగోవంతు పాడి ద్వారానే వస్తోందన్నారు. అయితే రైతులు కేవలం పాలను ఉత్పత్తి చేసి అమ్మడంపై మాత్రమే ఆధారపడకూడదని, పాలను పెరుగు, నెయ్యి, పన్నీర్, స్వీట్స్ వంటి ఉత్పత్తులుగా మార్చే విలువ జోడింపు ప్రక్రియలలో వారికి మరింత శిక్షణ ఇవ్వాలని, విలువ జోడింపు అనేది అదనపు ఆదాయాన్ని ఇస్తుందన్నారు. స్థానిక ఉపాధిని పెంచుతుందని వెంకయ్యనాయుడు సూచించారు.

పాడి పరిశ్రమ అంటేనే గ్రామీణ మహిళల సమర్థతకు ప్రతీక అని, మారుతున్న అవసరాలకు అనుగుణంగా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా, ప్రత్యేకంగా పాల ఉత్పత్తికి సంబంధించి మహిళా సహకార సంఘాలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పారు.

త్వరలోనే భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమని, ఇది వేగవంతం కావాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని, ఇలాంటి సహకార సంఘాలు దీనిపై దృష్టిపెట్టాలి అని సూచించారు. విజయ సహకార సంఘం విజయప్రస్థానం స్ఫూర్తిదాయకమని, 1965లో కేవలం 646 లీటర్ల పాల సేకరణ(Procurement of 646 liters of milk)తో మొదలైన కృష్ణా మిల్క్ యూనియన్ నేడు ఏటా 11 కోట్ల లీటర్ల పాలను సేకరిస్తూ అద్భుతమైన ప్రగతి సాధించిందని వెంకయ్యనాయుడు అభినందించారు.

రెండు లక్షల మంది పాడి రైతు కుటుంబాలకు ఈ సంస్థ వెన్నుదన్నుగా ఉండడం మంచి విషయమన్నారు. సమర్థ నాయకత్వంతో, కార్యదక్షతతో విజయ ను విజయాల బాట పట్టిస్తున్నారని కృష్ణా మిల్క్ యూనియన్ ప్రెసిడెంట్ చలసాని ఆంజనేయులు, మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వరబాబు లను, ఇతర పాలక మండలి సభ్యులను, పాడిరైతులను వెంకయ్యనాయుడు అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply