గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో ఎదురుమొండి మార్గదర్శి

గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో ఎదురుమొండి మార్గదర్శి
ఎదురుమొండిలో రివర్ వ్యూ ఎకో పార్క్, షెల్టర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే
నాగాయలంక, ఆంద్రప్రభ : గ్రామీణ పర్యాటక అభివృద్ధిలో రాష్ట్రానికి మార్గదర్శిగా ఎదురుమొండి గ్రామం నిలుస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం నాగాయలంక మండలం ఎదురుమొండిలో దీవి ముఖద్వారం వద్ద గ్రామ పంచాయతీ నిధులు రూ.2.50 లక్షలతో ఏర్పాటు చేసిన రివర్ వ్యూ ఎకో పార్క్, రూ.లక్షన్నరతో నిర్మించిన ప్రయాణికుల షెల్టర్లను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ పర్యాటకానికి ఎదురుమొండి నాంది పలికిందన్నారు. పర్యాటక అభివృద్ధి అంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చేయాలనే భావనకు వెళ్లకుండా, తక్కువ ఖర్చులో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని కలిగించేలా ఈ రివర్ వ్యూ ఎకో పార్క్ నిర్మించటం శుభ పరిణామం అన్నారు.

ఎదురుమొండి గ్రామ పంచాయతీ కనబరిచిన స్ఫూర్తితో నియోజకవర్గంలో కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామ పంచాయతీలన్నీ ఈ తరహాలో రివర్ వ్యూ పార్కులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కృష్ణానది ఒడ్డున ఉండే సహజ సిద్ధమైన ఆహ్లాదభరిత వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా పార్క్ ఏర్పాటు జరిగిందన్నారు. ప్రకృతి రమణీయమైన ప్రదేశంగా ఉన్న ఎదురుమొండిలో ఇలాంటి పార్క్, షెల్టర్ ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ సర్పంచ్ కన్నా సుధా కీర్తన, పంచాయతీ కార్యదర్శి ఆది అశోక్ లను అభినందించారు.
అనంతరం ఎదురుమొండి పంచాయతీ బ్రహ్మయ్య గారి మూలలో ఉపాధి నిధులు రూ.6.85లక్షలతో నిర్మించిన 106 మీటర్లు రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ చిలకలపూడి పాపారావు, జనసేన జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, టీడీపీ తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, జనసేన పార్టీ నాయకులు బచ్చు వెంకట్ నాధ్ ప్రసాద్, పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగం కార్యదర్శి లంకె యుగంధర్, మాజీ ఎంపీపీ కన్నా నాగరాజు, ఎంపీడీఓ కే.చంద్రశేఖర్, సర్పంచ్ కన్నా సుధా కీర్తన, పంచాయతీ కార్యదర్శి ఆది అశోక్, నీటి సంఘం అధ్యక్షులు నాయుడు బాబూరావు, వైస్ ఎంపీపీ మోకా నాగ ప్రసాద్, ఫిషర్ మెన్ సొసైటీ అధ్యక్షులు చెన్ను వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షులు కొక్కిలిగడ్డ నాగరాజు, మాజీ సర్పంచ్ నాయుడు మస్తాన్ రావు, మాజీ నీటి సంఘ అధ్యక్షులు సైకం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
