తాడేపల్లి -వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో నేడు జగన్ సమావేశమవుతారు. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మండల ప్రెసిడెంట్‌లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సమావేశంలో ఆయా జిల్లాల ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గాల ఇన్ ఛార్జిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, కూటమి ప్రభుత్వం అమలు చేయని ఎన్నికల హామీలపై ప్రజా పోరాటం, పార్టీ బలోపేతం తదితర అంశాలపై జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీపీ, జడ్పీ ఉప ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన నేతలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఇప్పటికే వైసీపీ నేతలు తాడేపల్లికి చేరుకున్నారు.