పరిహారం చెల్లించేదెన్నడు..? : హరీశ్‌రావు
నాగిరెడ్డిపేట, ఆంధ్రప్రభ : ఇటీవల వరదలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని, ఇల్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయలు చెల్లించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు, మంజీర నది పరవళ్లు తొక్కుతూ ఉప్పొంగి నాగిరెడ్డిపేట మండలంలో ముంపుకు గురైన పంట పొలాలను హరీశ్‌రావు ఈ రోజు పరిశీలించారు. నెల రోజులైనా పరిహారం ఇంతవరకు చెల్లించలేదని, రైతులకు నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. మండలంలో భారీ వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ఐదు వేల ఎకరాలు ముంపుకి గురై పంట నష్టం జరిగితే ఇప్పటికి ఒక్క రూపాయి కూడా అందించలేదని విమర్శించారు. ఇదివరకే ముఖ్యమంత్రి లింగంపేట్ మండలంలో పర్యటించి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని తెలిపారని, అందుకు జిల్లాలో 344 కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు నివేదిక సమర్పిస్తే నేటికి 35 రూపాయలు కూడా చెల్లించలేదని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి వి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎకరాకు 25 వేల రూపాయలు, ఇల్లు కూలిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సురేందర్, గంప గోవర్ధన్, జనార్దన్ గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.