నీవా పరీవాహక ప్రజల ఇబ్బందులు తీరుస్తాం

రూ.175కోట్లతో వంతెనలు, రీటైనింగ్ వాల్ పనుల ప్రతిపాదనలు సిద్ధం
నీవానది వరద ప్రాంతాల్లో కలెక్టర్ తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్


చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నీవా నదికి వరదలు వచ్చినా.. పరీవాహక ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాశ్వత పరిష్కారం చూపుతామ‌ని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ( MLA Gurajala JaganMohan) చెప్పారు. గురువారం కలెక్టర్ సుమిత్ కుమార్ తో కలిసి నగరంలోని నీవా నది పరీవాహక ప్రాంతాలైన తోట పాలెం ఎటివార, దోభీ ఘాట్, వీరభద్ర కాలనీ, తేనబండ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సంతపేట లిల్లీ బ్రిడ్జి దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి స్థానిక ప్రజలతో మాట్లాడారు.

నదికి అవతల ఉన్న కుటుంబాలతో మాట్లాడారు. సంతపేట విజయలక్ష్మి కాలనీ (Santhapeta Vijayalakshmi Colony) నుంచి రోడ్డు సౌకర్యం కల్పించి, వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్, ఎమ్మెల్యే.. మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అనంతరం వీరభద్ర కాలనీలో పర్యటించి స్థానికంగా దెబ్బతిన్న కల్వర్టరును పరిశీలించారు. అనంతరం తేనబండ కల్వర్టరును వరద నీటిలో దాటుకొని వెళ్లి పరిశీలించారు. నీవా నదిపై వంతెన నిర్మించాలని వారు కోరగా.. వంతెన నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని, తాత్కాలిక చర్యల్లో భాగంగా తేనబండ నుంచి సంతపేట విజయలక్ష్మి కాలనీ వరకు ఉన్న రోడ్డును మరమ్మతులు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.


జిల్లా వ్యాప్తంగా వర్షాలు బాగా కురవడంతో చెరువులను చాలా వరకు చెరువులు నిండిపోయి వాగులు పొంగుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తాయి. లిల్లీ బ్రిడ్జి (Lily Bridge) ని పరిశీలించాం. ప్రమాదకరంగా ఉంది. ఈ వంతెన స్థానంలో నూతన వంతెన నిర్మాణానికి గతంలోనే ప్రతిపాదనలు పంపించామ‌ని ఈ ప్రతిపాదనలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా నీవా నదికి వరదలు రావడంతో ఈ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడ్డార‌ని తెలిపారు. ఈ పరిస్థితిని ముందే ఊహించి నదిలో జేసీబీ సాయంతో ముళ్లపొదలు, పూడిక తొలగించడం జరిగింది.

దీంతో వరద ప్రభావం త్వరగా తగ్గింది. నీటిమట్టం పెరిగిన సమయంలోనే నగరపాలక అధికారులు, పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండి నీటి ప్రవాహానికి అడ్డంకులు లేకుండా తొలగించడం ద్వారా కొన్ని గంటల్లోనే నీటి మట్టాన్ని తగ్గించి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా సకాలంలో చర్యలు తీసుకున్నారు. నీవా నది పరివాహ ప్రాంతాల ప్రజల సమస్యలు శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ఇదివరకే రూ.175 కోట్లతో వంతెనలు, కల్వర్టర్లు, రీటైనింగ్ వాల్ (Culverts, retaining wall) నిర్మాణానికి ప్రతిపాదనలు ప్రభుత్వానికి, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ ఫైలు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉందని.. ప్రస్తుతం స్థానికంగా నెలకొన్న పరిస్థితులను కలెక్టర్ ద్వారా మరోసారి నివేదిస్తామన్నారు. స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.


నీవా నది వరదలతో ఇబ్బందులు పడ్డ వీరభద్ర కాలనీ (Veerabhadra Colony) ప్రజలకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నిత్యవసర సరుకులతో కూడిన బ్యాగును అందించారు. బియ్యం, పప్పులు, ఉప్పు, కూరగాయలు, దుప్పటితో కూడిన బ్యాగులను 500 కుటుంబాలకు అందించారు. కార్యక్రమంలో మేయర్ ఎస్ అముద, చుడా చైర్ పర్సన్ కఠారి హేమలత, కమిషనర్ పి నరసింహ ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, మొదలియార్ కార్పొరేషన్ చైర్మన్ త్యాగరాజులు, వెంకటేష్ యాదవ్, పచ్చప్ప, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంచార్జిలు, నగర, తెలుగు మహిళా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply