స్థానిక ఎన్నికలను ఎదుర్కొంటాం

స్థానిక ఎన్నికలను ఎదుర్కొంటాం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రదీప్ చౌదరితోపాటు పలువురు వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్సీ ఎల్.రమణ (MLC L. Ramana) ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కేటీఆర్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. వీటితోపాటు ఏ ఎన్నికలు వచ్చినా, పార్టీ వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న వాతావరణం చూస్తే.. గల్లీ ఎన్నికైనా, ఢిల్లీ ఎన్నికైనా బీఆర్‌ఎస్ (BRS) కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తుంది.’ అని కేటీఆర్ అన్నారు. ‘గ్యారెంటీల’ పేరుతో కాంగ్రెస్ చేసిన గారడీని ప్రజలు మర్చిపోలేదని, అన్నివర్గాల ప్రజలకు కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) ఎన్నికలకు ముందు గ్యారెంటీ కార్డులతో చేసిన గారడీలను గుర్తుచేసేందుకు తాము ‘బాకీ కార్డులను’ తీసుకువచ్చామని, ఈ ‘బాకీ కార్డుల’ ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతి వర్గానికి పడిన బాకీలను ఇంటింటికి, మనిషి మనిషికి తెలియజెప్పడానికి ఉద్యమాన్ని తీసుకున్నామని కేటీఆర్ అన్నారు. ఈ కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికి తీసుకుపోతే, ఓటర్లు కాంగ్రెస్‌కు బుద్ధిచెబుతారని అన్నారు.
