వాటర్ హీటర్ పేలి అగ్నిప్రమాదం

గన్నవరం, ఆంధ్రప్రభ ; గన్నవరం పట్టణంలోని ఆర్‌సీఎం చర్చి సమీపంలో సోమవారం ఉదయం స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక హార్డ్‌వేర్ దుకాణం పైఅంతస్తులోని గదిలో నివసిస్తున్న బ్యాచిలర్లు స్నానానికి నీళ్లు వేడి చేసేందుకు వాటర్ హీటర్‌ను ఆన్ చేశారు. ఈ క్రమంలో హీటర్ ఒక్కసారిగా పేలడంతో గదిలో మంటలు చెలరేగాయి.

క్షణాల్లో మంటలు వ్యాపించడంతో గదిలోని సామాగ్రి పాక్షికంగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో గదిలో ఉన్న వారు అప్రమత్తమై బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా హీటర్ ఓవర్ హీట్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Leave a Reply