తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు

తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
- కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుల హెచ్చరిక
మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని తగిన సమయంలో సరైన సమాధానం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు హెచ్చరించారు. గురువారం మంథని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళిత బంధు సాధన సమితి నాయకులు గద్దల శంకర్, ఊట్ల శ్రీను లు చేసిన ఆరోపణలు వారు తీవ్రంగా ఖండించారు. దళిత బందు పేరుతో బీఆర్ఎస్ హయాంలోనే మోసానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. దళితుల ఓట్ల కోసం మాత్రమే ఆ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులను దళితులను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేందుకే దళిత బంధు ఆశ చూపారని వారు వాపోయారు. తమ నాయకుడు, మంథని ఎమ్మెల్యే ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అంబేద్కర్ పథకం కింద దళితులకు రూ.12 లక్షలు అందజేస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నట్లుగా పార్టీ కార్యకర్తలకే పథకాలు పరిమితం చేసే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను దశలవారీగా అమలు చేస్తున్నామని, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహాలు, ఉచిత విద్యుత్ సబ్సిడీ గ్యాస్, రైతులకు బోనస్ వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.
మంథని అభివృద్ధికి కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా అహర్నిశలు శ్రమిస్తున్న శ్రీధర్ బాబుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంథని డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యం, మండల అధ్యక్షుడు మంథని రాకేష్, వెంకటాపూర్ సర్పంచ్ తోట పోచం, ఎరుకల రమేష్, ఎరుకల మధు, అక్కపాక సంపత్, తోకల మల్లన్న, పొన్నగంటి రమేష్, ఎరుకల సురేష్, గోమాస సమ్మయ్య, శేఖర్, కొండ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
