నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..!

నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..!
- నేడు శిథిలావస్థలో కూలిపోతోంది..
- పునరుద్ధరణ చేస్తారా?లేక పూర్తిగా కూలనిస్తారా?
- పిచ్చి మొక్కల్లో మునిగిపోయిన రైతన్నల గోదాం
- పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో దయనీయ స్థితి
- పునరుద్ధరణ కోసం అన్నదాతల ఎదురుచూపులు
- ప్రభుత్వ స్పందన కోసం గ్రామస్థుల విజ్ఞప్తి
స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం గ్రామంలో దాదాపు 30 ఏళ్ల క్రితం ప్రారంభమైన పీఏసీఎస్ గోదాం ప్రస్తుతం గత పాలకులు, అధి కారుల నిర్లక్ష్యానికి బలై శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు గ్రామ రైతులకు ఈ గోదాం అండగా నిలిచింది. ఇప్పుడు పూర్తిగా నిరుపయోగంగా మారి పిచ్చి మొక్కలతో కప్పబడిన దుస్థితిని ఎదుర్కొంటోంది. ఈ గోదాం ప్రారంభ దశలో రైతులకు పిండి బస్తాల పంపిణీ, వ్యవసాయ పని ముట్ల సరఫరా వంటి సేవలు అందిస్తూ కీలక కేంద్రంగా మారింది.
గ్రామ రైతులు తమ అవసరాల కోసం ఈ గోదాంపైనే ఆధారపడేవారు. కాలక్రమేణా నిర్వహణలో లోపాలు ఏర్పడి గోదాం క్రమంగా నిర్లక్ష్యానికి గురైంది. గత ప్రభుత్వ కాలంలో కూడా కొంతకాలం పాటు పిండి బస్తాల పంపిణీ కొనసాగినప్పటికీ, తరువాత పూర్తిగా ఆగిపోవడంతో గోదాం మూతపడింది.
- గోదాం పునరుద్ధరణపై ఆశలు పెట్టుకున్న రైతులు:
ప్రస్తుతం గోదాం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాటు భవనం కూడా కూలిపోతుందేమో అన్న ఆందోళన గ్రామస్థుల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తృతంగా కొనసాగుతుండటంతో గోదాం పునరుద్ధరణపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. గోదాం మళ్లీ ఉపయో గంలోకి వస్తే ఎరువులు, విత్తనాలు, ఇతర వ్యవసాయ అవసరాల సరఫరా సులభతరం అవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు స్పందించి గోదాం పున రుద్ధరణకు చర్యలు చేపట్టి, రైతులకు మళ్లీ ఉపయోగపడే విధంగా మార్పులు చేయాలని స్థానికులు, రైతు సంఘాలు, అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
