విజయవాడ ఉత్సవ్ ఘన విజయం అందరిదీ..

  • అన్ని వర్గాల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం…
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువూరులో క్లీన్ సీప్ చేస్తాం..
  • టిడిపి కార్యకర్తల కృషి వల్లే ఘనవిజయం సాధించాం..
  • విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్…

తిరువూరు ,ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జెండా మోసే ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా తాను ఎల్లప్పుడూ ఉంటానని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని శివనాద్ ప్రకటించారు. తిరువూరు పట్టణం రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎంపీ కేశినేని శివనాథ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులు లక్ష్మీపురం నుంచి తిరువూరు వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

నియోజకవర్గం నలుమూలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో తిరువూరు పట్టణం పసుపుమయమైంది. పర్యటనలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరు బైపాస్ రోడ్డులోని అయ్యప్పస్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం పట్టణం అంతటా టీడీపీ శ్రేణులు ఎంపీపై పూల వర్షం కురిపిస్తూ బ్రహ్మరధం పట్టారు.ఈ సందర్భంగా పట్టణం అంతా పసుపు జెండాలతో, కార్యకర్తల నినాదాలతో మార్మోగి పండుగ వాతావరణాన్ని తలపించింది. ఎంపీ పర్యటనతో తిరువూరు పట్టణంలో మొత్తం సందడి వాతావరణం నెలకుంది.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ఎవరైనా కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించనని స్పష్టం చేశారు. టిడిపి కార్యకర్తలకు దోచుకోవడం, దాచుకోవడం రాదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారని తెలిపారు.

కార్యకర్తల కృషి ఫలితంగానే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. ఎన్నికల సమయంలో కార్యకర్తలు పడిన కష్టాన్ని జీవితంలో ఎప్పటికీ మర్చిపోనని అన్నారు. ఎన్నికల హామీల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు.

హామీలకే పరిమితం కాకుండా, ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తోందని వివరించారు. విజయవాడ ఉత్సవ్ అమ్మవారి ఆశీస్సులతో అంగరంగ వైభవంగా జరిగినట్లు ఎంపీ గుర్తుచేశారు. 11 రోజులపాటు జరిగిన దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోదభరిత కార్యక్రమాలను ఆస్వాదించారని చెప్పారు.

ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒక ఆటో డ్రైవర్ ఖాతాకు రూ.15 వేలు జమచేసి పథకాన్ని ప్రారంభించారని వివరించారు.

అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన అన్నారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంలో విజయవాడ నుంచి వచ్చిన ఒక ఆకురౌడీని టిడిపి కార్యకర్తలు టోల్ గేట్ వద్ద అడ్డుకొని వెనక్కి తరిమేశారని, అతను పోలీసులను బతిమాలుకొని క్షేమంగా విజయవాడకు వెళ్ళాడని ఎంపీ చెప్పారు.

మూడుసార్లు ఎన్నికల్లో ఓడిపోయిన, కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సిపి నాయకులు విజయవాడ ఉత్సవ్ పేరిట అసత్యాలు ప్రచారం చేస్తూ, కోట్లు దోచుకున్నట్టు ఆరోపించడం దుర్మార్గమని, ప్రజలు గుణపాఠం చెబుతున్నా వారికి బుద్ధి రావడం లేదని అన్నారు.

అసత్యాలు ప్రచారం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని, పద్ధతి మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించడమే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అవసరమైతే తిరువూరులోనే కూర్చుని క్లీన్ సీప్ చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.

Leave a Reply