- పెండింగ్ బకాయిలు రూ.16 కోట్లు విడుదల
- అన్ని నోటిఫికేషన్లలో క్రీడాకారులకు ప్రాధాన్యం
- మెగా డీఎస్సీలో క్రీడాకారులకు 421 పోస్టులు
- ఆడుదాం ఆంధ్రపై విజిలెన్స్ విజిలెన్స్ ఎంక్వయిరీ పూర్తి
- ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు
ఎన్‌టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : సమగ్ర క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, క్రీడాకారుల భవిష్యత్తు, నైపుణ్య శిక్షణ, అవకాశాలు ఇలా అన్నింటిలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుని క్రీడలను ప్రోత్సహిస్తున్నట్లు ఏపీ శాప్ చైర్మన్ ఎ.రవి నాయుడు (RaviNaidu) తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. క్రీడాకారుల బకాయిలన్నింటిని చెల్లించామన్నారు. ఆడుదాం ఆంధ్ర స్కాంకు సంబంధించి విజిలెన్స్ విచారణ పూర్తయిందని, అసెంబ్లీ సమావేశాలలోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం విజయవాడ (Vijayawada)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల విశాఖపట్నంలో నేషనల్ స్పోర్ట్స్ డేను అత్యంత వైభవంగా నిర్వహించామని, అమరావతి ఛాంపియన్షిప్ కూడా అనూహ్య స్పందన వచ్చినట్లు తెలిపారు.
ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకాలు..
తొలిసారిగా ఆటగాళ్లకు నగదు ప్రోత్సాహకాలు (Cash incentives) అందించనున్నట్లు రవి నాయుడు తెలిపారు. వచ్చే ఏడాది కూడా మూడు లక్షలకు పైగా క్రీడాకారులను స్పోర్ట్స్ డే లో భాగస్వామ్యం చేసేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. క్రీడా దినోత్సవానికి ముందే క్రీడాకారులు రూ 16 కోట్ల 17 లక్షలు ప్రోత్సాహకాలు చెల్లించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం (Central Government) క్రీడలపై తీసుకువచ్చిన చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన దానిని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఇటీవల ప్రకటించిన మెగా డీఎస్సీలో క్రీడాకారులకు 421 పోస్టులు స్పోర్ట్స్ కోటాలో వచ్చాయని, సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయినట్లు చెప్పారు. అయితే 870 ఫేక్ సర్టిఫికెట్లు రావడం ఆశ్చర్యం కలిగించిందని, నకిలీ సర్టిఫికెట్ల పై అవసరమైన విచారణ (investigation) జరిపి, డీఎస్సీ నియామకాల తరువాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆడుదాం ఆంధ్ర విజిలెన్స్ విచారణ పూర్తి..
వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిన ఆడుదాం ఆంధ్ర వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే విజిలెన్స్ విచారణ పూర్తయిందని శాప్ చైర్మన్ రవి నాయుడు (Ravi Naidu) ప్రకటించారు. విచారణ కాస్త ఆలస్యమైనప్పటికీ నిష్పక్షపాతంగా పారదర్శకంగా విచారణ జరిగినట్లు తెలిపారు. సెప్టెంబర్ 18 నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలలోగా ప్రభుత్వం ఈ వ్యవహారంపై తగిన నిర్ణయం తీసుకుంటుందని, ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందుకు బాధ్యులైన వారిపై కఠిన శిక్షలు తీసుకుంటున్నామన్నారు.
క్రీడాకారులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని అంశంపై స్పందించిన ఆయన దీనిపై కూడా విచారణ జరుగుతుందని తెలిపారు. అంతర్గత కలహాలు, ఆధిపత్య పోరు కారణంగా కొన్ని అసోసియేషన్లు (Associations) క్రీడాకారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి అసోసియేషన్లు క్రీడాకారులకు ఇబ్బంది పెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గుర్తింపు లేని అసోసియేషన్లు వలన క్రీడాకారుల సైతం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. క్రీడా సంఘాలతో ఇక నుండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడంతోపాటు అసోసియేషన్ లను స్టీమ్ లైన్ చేస్తామన్నారు.