toppers | దారుణంగా ఆడుతున్నారు..!

toppers | దారుణంగా ఆడుతున్నారు..!
ఫామ్ కోల్పోయిన వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ
టీ20 ప్రపంచకప్‌లో విఫలం
జట్టుగా భారంగా మారిన టాపర్స్
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : టీ20 వరల్డ్‌కప్‌లో భారత ఆటగాళ్లు ఇద్దరు తీవ్రంగా నిరాశ పరిచారు. ఒకరు విధ్వంసక బ్యాటర్ అభిషేక్ శర్మ కాగా, మరొకరు మిస్టరీ స్పిన్నర్ వరుణ్‌చక్రవర్తి. టోర్నీ ప్రారంభానికి ముందు వీరిద్దరిపై అధికంగా అంచనాలు ఉండేవి. వీరిద్దరు రాణిస్తే భారత్‌కు తిరుగుండదని అంతా భావించారు. తీరా వీరిద్దరే ఇప్పుడు టీమిండియాకు భారంగా మారారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్‌లో డబుల్ డిజిట్ పరుగులు కూడా చేయలేకపోతున్నారు. మ్యాచ్ మొదటి, రెండు ఓవర్లలోనే పెవిలియన్ చేరుతున్నాడు. స్పిన్నర్లను ఆడటంలో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఇదే అదునుగా చూసుకొని ప్రత్యర్థులు అభిషేక్‌ను స్పిన్ ఉచ్చులో పడేస్తున్నారు.

ఈ టోర్నీలో అతడు ఏడు మ్యాచులు ఆడాడు. కేవలం ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్లు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అతడు చేసిన మొత్తం పరుగులు 89 మాత్రమే. నాలుగు మ్యాచుల్లో ఆఫ్ స్పిన్నర్‌కే వికెట్ సమర్పించడం గమనార్హం. ఒకవైపు సంజు లేదా ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతూ అభిషేక్‌పై ఒత్తిడి తగ్గించారు. అలాంటప్పుడు కాస్త సమయం తీసుకొంటే బాగుంటుందనేది మాజీల సూచన. కనీసం పవర్ ప్లే ముగిసేవరకూ ఔట్ కాకుండా ఉంటే చాలు.. అతడు క్రీజ్‌లో ఉన్నాడంటే ఎప్పుడైనా హార్డ్ హిట్టింగ్ చేస్తాడని ప్రత్యర్థి బౌలర్లు బెదురుతారు. అయితే, నంబర్ వన్ టీ20 ప్లేయర్‌కు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటకు ఎలా రావాలో బాగా తెలుసు. కొద్దిగా ఓర్పు.. కొద్దిగా నేర్పు ప్రదర్శిస్తే ఫైనల్లో మునుపటి అభిషేక్‌ను చూడొచ్చనేది కాదనలేని వాస్తవం.

మిస్టరీని ఛేదించేశారా..?
టీ20 ప్రపంచకప్ ముందు వరకు వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ప్రత్యర్థి బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అతని మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టాడు. మ్యాచ్ విన్నర్‌గా పేరొందిన వరుణ్ ఒక్కసారి తేలిపోతున్నాడు. ప్రపంచ కప్‌లో వికెట్లు తీస్తున్నా ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటికీ భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి (13) కొనసాగుతున్నాడు. కానీ, కీలకమైన గత రెండు మ్యాచుల్లో అతడి ‘మిస్టరీ’ బౌలింగ్‌ను ప్రత్యర్థి బ్యాటర్లు ఛేదించారు. తన స్పెషలిస్ట్ డెలివరీ అయిన ‘గూగ్లీ’ కూడా వర్కౌట్ కావడం లేదు. ఎనిమిది మ్యాచుల్లో 28 ఓవర్లు వేసిన వరుణ్ ఏకగా 248 పరుగులు ఇచ్చాడు. సూపర్-8 నుంచి వరుణ్ నుంచి మెరుగైన బౌలింగ్ బయటకు రాలేదు. దాదాపు ప్రతి మ్యాచ్‌లోనూ వికెట్ తీశాడు కానీ, భారీగా పరుగులు సమర్పించాడు. సెమీస్‌లోనే కీలకమైన జోస్ బట్లర్‌ను బౌల్డ్ చేసిన వరుణ్.. తన నాలుగు ఓవర్ల కోటాలో ఒక్క వికెట్ మాత్రమే తీసి ఏకంగా 64 పరుగులు ఇచ్చేశాడు. వరుణ్ బౌలింగ్‌లో యువ క్రికెటర్లు బెతెల్, డేవాల్డ్ బ్రెవిస్ భారీ షాట్లతో విరుచుకుపడ్డారు. పవర్ ప్లేలో ప్రభావవంతంగా ఉండే వరుణ్… తేలిపోవడం అభిమానులను నిరాశకు గురిచేసింది. ఫైనల్‌కు వేదిక అయిన అహ్మదాబాద్ పిచ్ బౌలింగ్‌కు అనుకూలం. ఫైనల్లో అయినా ఈ ఇద్దరు రాణించాలని, భారత్ కప్ గెలవాలని ఆశిస్తున్నారు.
