Urvakonda | రథసప్తమి వేడుకలు.. విస్తృత ఏర్పాట్లు

Urvakonda | రథసప్తమి వేడుకలు.. విస్తృత ఏర్పాట్లు
Urvakonda | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బూదగవిలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం రథసప్తమి వేడుకలకు ముస్తాబైంది. ఈనెల 24 నుండి 25 తేదీ వరకు జరిగే రథసప్తమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సూర్యనారాయణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ చత్రగుడి చిరంజీవి, కమిటీ సభ్యులు మహేంద్ర గౌడ్ లు తెలిపారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా ఈనెల 24వ తేదీన మహాగణ పతి పూజ, గంగపూజ, గోపూజ, పుణ్యాహవాచనం, దేవానాంది పూజ, పంచగవ్య ప్రాసన, రక్షాబంధన, సర్వతో భద్రమండల దేవత ఆవాహన ఆరాధన, నవగ్రహ ఆరాధన, కలశస్థాపన, ప్రధాన దేవతా వాహన పూజ చేయనున్నారు. అలాగే దీక్షా హోమము, మూలమంత్ర జపములు, ఏకావర్తి, మహాగణపతి, నవగ్రహ మృత్యుంజయ, మూల మంత్ర హోమములు, మంత్రపుష్పం, అష్టావధాన సేవ, మహా మంగళహారతి, తీర్థప్రసాదాలు అందచేయనున్నారు.

25వ తేదీన తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు షోడశోపాచార పూజ, ఈశ్వరునికి పంచామృతాభిషేకం, రుద్రా భిషేకం, సూర్యునికి మహా సౌర పూర్వక అరుణ రుద్రా భిషేకం, మహా మంగళ హారతి, 7 గంటల నుండి 9- 30 గంటల వరకు శ్రీ ఛాయా ఉష సమేత సూర్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం 9-30 నుండి 12-30 వరకు శ్రీ మహాగణపతి హోమం, నవగ్రహ హోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్య హోమం, రుద్రస్వాహాకార హోమం, మహాసౌర, పూర్వక అరుణ హోమం, దుర్గా సూక్త హోమం, మహా పూర్ణహుతి, తీర్థ ప్రసాద వినియోగం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆలయ చరిత్ర : ఉరవకొండ పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో అనంతపురం – బళ్ళారి 42వ జాతీయ రహదారి ప్రక్కలో ఉన్న బూదగవి గ్రామంలో సూర్యనారాయణ స్వామి ఆలయం వెలిసింది. ఈ ఆలయానికి 13వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ ఆలయం మన రాష్ట్రంలో 2 వదిగా, దక్షిణ భారతదేశంలో 3 వదిగా, యావత్ భారతదేశంలో 8వ ఆలయం. బూదగవిలోని శ్రీ సూర్య నారాయణ స్వామి దేవాలయంలో స్వామి దక్షిణా ముఖంగా ఉంటారు. ప్రపంచంలోనే దక్షిణాభి ముఖంగా ఉన్న ఏకైక సూర్య దేవాలయం ఇదేనని చెబుతారు.
శాస్త్ర ప్రకారం.. దక్షిణ దిక్కుకు అధిపతి సూర్యుని కుమారుడైన యముడు. అందుకే ఈ ఆలయం ఎంతో విశిష్టమైంది. సూర్య భగవాన్ ని ఆరోగ్యప్రధాన దాతగా చెబుతారు. దక్షిణా ముఖంగా ఉన్న ఈ ఆలయంలో పూజలందుకునే ఈ స్వామి అపమృత్యు భయ్యాన్ని కూడా పోగొడతాడని భక్తులు విశ్వసిస్తారు. ఈ ఆలయంలో పూజలు, యజ్ఞా యాగాలు, దానాలు చేస్తే ఎన్నో విశిష్ట ఫలితాలు వస్తాయని చెబుతారు. హనుమాన్ కు అన్ని విద్యలు నేర్పిన గురువు సూర్యనారాయానుడు. గురువుకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లు ఇక్కడి హనుమ ప్రతిమ ఉంది. ఇలాంటి ప్రతిమ ఉండటం అరుదు. రథసప్తమి వేడుకలను తిలకించడానికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర తదితర ప్రాంతాల నుండి భక్తులు వేలాది మంది తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా సీఐ మహానంది, ఎస్సై జనార్ధన్ నాయుడు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
