Training camp | ట్రైనింగ్ సక్సెస్ఫుల్

Training camp | ట్రైనింగ్ సక్సెస్ఫుల్
- మానుకోటలో ఉచిత విలువిద్య శిక్షణ శిబిరం విజయవంతంగా ముగింపు
Training camp | మానుకోట, ఆంధ్రప్రభ : మానుకోట పట్టణ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారం రోజులుగా నిర్వహించిన ఉచిత విలువిద్య (ఆర్చరీ) శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది.

గ్రామీణ యువతలో క్రీడలపై ఆసక్తి, క్రమశిక్షణ, ఏకాగ్రతను పెంపొందించి, వారికి సరైన దిశానిర్దేశం అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది. ముగింపు కార్యక్రమానికి పట్టణ డీఎస్పీ ఎన్. తిరుపతి రావు ముఖ్య అతిథిగా హాజరై యువ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామీణ ప్రాంత యువత కూడా క్రీడారంగంలో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనే ఆశాభావం వ్యక్తం చేశారు. విలువిద్య అభివృద్ధికి తన వంతు సహాయంగా ఒక ఆర్చరీ బోర్డును స్పాన్సర్ చేసినట్లు ప్రకటించారు.

కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు సాదుల సారంగపాణి అధ్యక్షత వహించారు. ట్రస్ట్ కార్యకలాపాలను వివరించిన ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, క్రీడా అభివృద్ధి, సామాజికంగా బలహీన వర్గాల ఉద్ధరణ లక్ష్యంగా ట్రస్ట్ స్థాపించబడిన విషయాన్ని గుర్తు చేశారు.
పేద విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి పంపిణీ, నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు.

ఆర్చరీ డెవలప్మెంట్ బోర్డు సభ్యులు పుట్ట శంకరయ్య ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. విలువిద్యలో ఉన్న అవకాశాలు, భవిష్యత్లో యువతకు లభించే క్రీడా అవకాశాలపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు సాదుల సురేష్, రఘువీర్, ఉపేందర్, జయంత్, పట్టణ ప్రముఖులు శ్రీరంగం మురళీకృష్ణ, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పొందిన యువత ప్రదర్శించిన విలువిద్య కార్యక్రమాలు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాయి.
గ్రామీణ క్రీడాభివృద్ధికి దోహదపడే ఈ శిబిరాన్ని స్థానికులు, తల్లిదండ్రులు విశేషంగా అభినందించారు. మానుకోట జిల్లా నుండి జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా కారులు తయారు కావాలంటే తల్లి తండ్రులు, విద్యాలయాలు పిల్లలను ప్రోత్సహిస్తూ వారికి కావలసిన క్రీడా సౌకర్యాలు సామగ్రిని సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు కూడా వ్యవస్థా గత ఏర్పాట్లకై కృషి చేయాలని కోరారు. ఆర్చరీ క్రీడా అభివృద్ధికై, పిల్లల భవిష్యత్తు కోసం తమ వంతు సహకారం అందిస్తామని సారంగపాణి మరియు పుట్ట శంకరయ్య చెప్పారు
