AP | ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందే… క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : దేశ భ‌విష్య‌త్తు యువ‌త చేతుల్లోనే ఉంద‌ని, ప్ర‌తిఒక్క‌రూ ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌ను తు.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తూ భ‌ద్ర‌మైన స‌మాజం దిశ‌గా ముంద‌డుగు వేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం జిల్లా ర‌వాణా శాఖ ఆధ్వ‌ర్యంలో 36వ జాతీయ ర‌హ‌దారి భ‌ద్ర‌తా మాసోత్స‌వాలు (జ‌న‌వ‌రి 16-ఫిబ్ర‌వ‌రి 15) సంద‌ర్భంగా ఇందిరాగాంధీ మునిసిప‌ల్ మైదానం-ఈట్ స్ట్రీట్ వ‌ద్ద ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈసంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ‌, విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ హెచ్ఎం ధ్యానచంద్ర‌, అధికారులు త‌దిత‌రుల‌తో క‌లిసి ర‌హ‌దారి భ‌ద్ర‌త వాక‌థాన్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాక‌థాన్ బెంజ్ స‌ర్కిల్ వ‌ర‌కు సాగింది.

ఈ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా.జి.ల‌క్ష్మీశ మాట్లాడుతూ… స్వ‌ర్ణాంధ్ర సాకారానికి ర‌హదారి భ‌ద్ర‌త కూడా అత్యంత ముఖ్య‌మ‌ని, యువ‌త‌తో పాటు ప్ర‌తిఒక్క‌రూ ర‌హ‌దారుల‌ను బాధ్య‌తాయుతంగా ఉప‌యోగించుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. గ‌తేడాది ఒక్క ఎన్‌టీఆర్ జిల్లాలోనే రోడ్డు ప్ర‌మాదాల వ‌ల్ల 400మందికి పైగా మ‌ర‌ణించారంటే మ‌న ర‌హ‌దారుల భ‌ద్ర‌త‌పై ప్రతిఒక్క‌రూ ఆలోచించాల్సిన అవ‌స‌ర‌ముంద‌న్నారు. కేవ‌లం వాహ‌నాల‌ను న‌డిపే వారు మాత్ర‌మే కాకుండా దాదాపు 50శాతం మ‌ర‌ణాలు పాద‌చారులకు సంబంధించిన‌వేన‌ని వివ‌రించారు.మ‌నం ర‌హ‌దారుల‌ను సుర‌క్షితంగా ఉప‌యోగించుకుంటే మ‌నల్ని చూసి మిగిలిన వారూ అదే దారిలో పయ‌నిస్తార‌న్నారు. లైసెన్సు లేకుండా, హెల్మెట్ లేకుండా ప్ర‌యాణించ‌డం స‌రికాద‌ని.. మ‌న భ‌ద్ర‌త కోస‌మే వాటిని త‌ప్ప‌నిస‌రిగా ఉప‌యోగించాల‌నే విష‌యాన్ని గుర్తించాల‌న్నారు. ఇంత‌గా అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నా బాధ్య‌త మ‌రిస్తే చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్య‌క‌లాపాల‌ను కూడా ప‌క‌డ్బందీ అమ‌లు చేస్తున్నామ‌ని.. ర‌హ‌దారి భ‌ద్ర‌త దిశ‌గా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల్లో భాగ‌మ‌వుతున్న వివిధ శాఖ‌ల అధికారులు, ఎన్‌జీవోలు, ప్రైవేటు సంస్థ‌లకు అభినంద‌న‌లు, ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ తెలిపారు.

అంతే భ‌ద్రంగా ఇంటికెళ్లాలి….
ఇంటి నుంచి ఎంత భ‌ద్రంగా బ‌య‌టికి వ‌చ్చామో అంతే భ‌ద్రంగా ఇంటికి వెళ్లి, కుటుంబ స‌భ్యుల‌తో ఆనందంగా గ‌డ‌పాలంటే ప్ర‌తిఒక్క‌రూ ర‌హ‌దారి భ‌ద్ర‌తా నియ‌మాల‌ను పాటించాల‌ని విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ హెచ్ఎం ధ్యాన‌చంద్ర అన్నారు. ర‌హ‌దారి భ‌ద్ర‌త‌కు ఇంజ‌నీరింగ్ ప‌రంగా వివిధ చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని.. వీటికి తోడు ప్ర‌జ‌లు కూడా ట్రాఫిక్ నిబంధ‌న‌లు పాటించాల‌ని ధ్యాన‌చంద్ర కోరారు.


డీటీసీ ఎ.మోహ‌న్ మాట్లాడుతూ.. ప్ర‌మాదం జ‌రిగాక బాధ‌ప‌డేకంటే, జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం అత్యుత్త‌మ‌మ‌ని, ర‌హ‌దారి భ‌ద్ర‌త మాసోత్స‌వాల సంద‌ర్భంగా ర్యాలీలు, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. ర‌వాణా, ర‌హ‌దారులు-భ‌వ‌నాలు, పోలీస్‌, ట్రాఫిక్ త‌దిత‌ర విభాగాల అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు ర‌హ‌దారి భ‌ద్ర‌తా క‌మిటీ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. పాద‌చారులు కూడా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ రోడ్డును దాట‌కుంటా ట్రాఫిక్ సూచ‌న‌లు పాటించాల‌ని సూచించారు. ఇప్పుడు నేర్చుకున్న విష‌యాల‌ను జీవితాంతం గుర్తుపెట్టుకోవాల‌ని డీటీసీ మోహ‌న్ అన్నారు.

ఈకార్య‌క్ర‌మంలో డీటీసీ ఎ.మోహ‌న్‌, ఏపీఎన్‌జీజీవో నేత‌లు కేవీ శివారెడ్డి, ఎ.విద్యాసాగ‌ర్‌, ర‌వాణా శాఖ ఉద్యోగుల సంఘం జోన‌ల్ అధ్య‌క్షులు ఎం.రాజుబాబుతో పాటు డీఎంహెచ్‌వో డా.ఎం.సుహాసిని, జిల్లా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేట‌ర్ డా.కొల్లేటి ర‌మేష్‌, ఆర్‌టీవోలు ఆర్‌.ప్ర‌వీణ్‌, కె.వెంక‌టేశ్వ‌ర‌రావు, మోటార్ వెహిక‌ల్ ఇన్‌స్పెక్ట‌ర్లు ఎ.ఉద‌య శివ‌ప్ర‌సాద్‌, వై.నాగేశ్వ‌ర‌రావు, కె.శివ‌రామ‌గౌడ్‌, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, పీబీ సిద్ధార్థ‌, కేబీఎన్‌, శ్రీ దుర్గా మ‌ల్లేశ్వ‌ర సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాల‌, ఎస్ఆర్ఆర్-సీవీఆర్ డిగ్రీ క‌ళాశాల త‌దిత‌ర విద్యాసంస్థ‌ల విద్యార్థులు, ర‌వాణా శాఖ అధికారులు, ఉద్యోగులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *