స్టూడెంట్స్‌ను అక్కడ తడిమి చూస్తున్న టీచర్లు
నైజీరియాలో ఓ వర్సిటీ ఆంక్షలు
లేడీ స్టూడెంట్స్‌కి చెకింగ్ తంటాలు
అసభ్యతను దూరం చేయడానికే అంటున్న వర్సిటీ
గౌరవంగా ఉండటానికేనన్న విద్యార్థి సంఘాలు
హక్కుల ఉల్లంఘన అంటున్న హ్యూమన్‌రైట్స్ సంస్థ
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్క్ – ఒకప్పుడు పరీక్షల కాలమొచ్చిందంటే.. బడిపిల్లలు, కాలేజీ పోరగాల్లు నానా హైరానా పడేవాళ్లు. పుస్తకాల పురుగుల్లా బట్టీల మీద బట్టీ పట్టేది. ఈ బాధ తట్టుకోలేనోల్లు కాపీ రాయుళ్ల అవతారంలో స్లిప్పులు తీసుకుపోతే.. స్క్వాడ్ వచ్చి బట్టలూడదీసే రీతిలో చెక్కింగులు చేసేది. తాజాగా నైజీరియాలోని ఓ యూనివర్సిటీ లేడీ స్టూడెంట్స్ ఎగ్జామ్ హాళ్లోకి వెళ్లటం ఆలస్యం .. డ్రెస్ చెక్ చేసి, బ్రా ఉందా.. లేకుంటే నో ఎగ్జామ్ అని వెనక్కి పంపిస్తున్నారు. విద్యార్థినులు బ్రా (లో దుస్తులు) ధరించారో లేదోనని నిశితంగా తడుముతూ చెక్ చేస్తున్న వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో వర్సిటీ తీరుపై విమర్శలు చెలరేగాయి.
ఛాతి తడిమి చూస్తున్న సిబ్బంది..
నైజీరియాలోని ఓగున్ రాష్ట్రంలో ఒలాబిసి ఒనాబాంజో యూనివర్సిటీలోని పరీక్ష హాలులోకి వస్తున్న విద్యార్థినుల ఛాతీని మహిళా సిబ్బంది తనిఖీలు చేస్తున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోపై యూనివర్సిటీ స్పందించలేదు. కానీ, యూనివర్సిటీలో డ్రెస్ కోడ్ పేరిట లోదుస్తులు నిబంధన ఇరకాటంలో పెట్టింది. ఈ విధానాన్ని అనాగరికం, లైంగిక దాడిగా విమర్శకులు ఖండిస్తుంటే.. విద్యాసంస్థ వాతావరణాన్ని స్వేచ్ఛగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ సిస్టమ్ అమలు చేస్తున్నట్టు ఓ విద్యార్థినేత తెలిపారు.
దీనికి మరింత మెరుగైన పద్ధతులను అనుసరిస్తే మంచిదని ఆయన చెప్పుకొచ్చారు.
గౌరవంగా ఉండటానికే..
విమర్శలు వస్తున్న నేపథ్యంలో గౌరవప్రదమైన, స్వేచ్ఛాయుత వాతావరణం దెబ్బతినకుండా సంస్థ విలువలకు అనుగుణంగా విద్యార్థినుల వస్త్రధారణ హుందాగా ఉండేలా చూడటమే డ్రెస్ కోడ్ లక్ష్యం అని యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేత మయిజ్ ఒలాతుంజీ చెప్పారు. ఈ విధానం కొత్తది కాదు. అసభ్య వస్త్రధారణను అరికట్టేందుకు ప్రత్యామ్నాయ పద్ధతులు పాటించేలా విద్యాసంస్థతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులు, సిబ్బంది మధ్య గౌరవంగా, హుందాగా సంభాషణలు కొనసాగడంపై దృష్టి సారించాం అని అన్నారు. ఇతరులు లైంగిక ఆకర్షణకు గురయ్యేలా కనిపించే అసభ్య వస్త్రధారణను నిషేధిస్తున్నాం అని విద్యార్థి సంఘం నాయకులు వాదిస్తున్నారు.
హక్కుల ఉల్లంఘన.. కేసు పెట్టొచ్చు
తమ హక్కులను ఉల్లంఘించేలా ప్రవర్తించినందుకు వర్సిటీపై విద్యార్థులు కేసుపెట్టవచ్చని హ్యూమన్ రైట్స్ నెట్వర్క్ క్యాంపెయిన్ గ్రూపులోని ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఇతరుల శరీరాన్ని అనవసరంగా తాకడం హక్కుల ఉల్లంఘన అవుతుంది. అది చట్టపర చర్యలకు దారితీయొచ్చు. అసభ్యకర వస్త్రధారణను అరికట్టడానికి విశ్వవిద్యాలయం ఈ పద్ధతిని అనుసరించడం తప్పు అని మానవహక్కుల ప్రతినిధి హరుణ అయాగి అన్నారు. వర్సిటీ మతపర సంస్థ కాకపోయినా, కఠిన నైతిక నియామవళిని అమలు చేస్తోందని ఓ విద్యార్థిని ఆవేదన వ్యక్తం చేశారు.