టిప్పర్లకు అనుమతి లేదు..

టిప్పర్లకు అనుమతి లేదు..
- రైతుల ఆందోళనతో రంగంలోకి ఇరిగేషన్ అధికారులు
- అక్రమంగా టిప్పర్లు నడిపితే పోలీసులకు ఫిర్యాదు
- రైతులతో కలిసి కట్టను పరిశీలించిన ఏఈ యాసర్
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం శివారులోని బండ్లకుంట కట్ట మీదుగా మట్టి టిప్పర్లు వెళ్లడం పై ఇరిగేషన్ శాఖ తీవ్రంగా స్పందించింది. సింగారపేని గుట్ట నుంచి మట్టిని టిప్పర్లతో తరలిస్తూ ప్రతి రోజూ బండ్ల కుంట కట్ట మీదుగా తీసుకెళ్తుండటంతో దుమ్ము ఎగసిపడి సమీపంలోని పంట చేల పై పేరుకుపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. టిప్పర్ల రాకపోకలతో కట్ట దెబ్బతినే ప్రమాదం ఉందని, పంటలకు కూడా నష్టం జరుగుతోందని రైతులు పేర్కొన్నారు. మరో వైపు, బండ్లకుంట మత్తడి వద్ద క్వారీ యజమాని అనుమతి లేకుండా సిమెంట్ పైపులు ఏర్పాటు చేయడం, వాటిని రైతులు తొలగించడం వివాదానికి దారి తీసింది. దీంతో మంగళవారం ఇరిగేషన్ ఏఈ యాసర్ రైతులతో కలిసి కట్టను పరిశీలించారు. పరిశీలన అనంతరం ఏఈ మాట్లాడారు.
- బండ్లకుంట కట్ట మీదుగా మట్టి టిప్పర్లకు ఎలాంటి అనుమతి లేదు : ఏఈ యాసర్
బండ్లకుంట కట్ట మీదుగా మట్టి టిప్పర్లు వెళ్లేందుకు ఎలాంటి అనుమతి లేదు. ఇరిగేషన్ శాఖ అనుమతి లేకుండా కుంట మత్తడి వద్ద పైపులు ఏర్పాటు చేయడం తప్పని చెప్పారు. ఎవరైనా అక్రమంగా టిప్పర్లను పోనిస్తే.. తమకు పిర్యాదు చేయండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. కుంట మత్తడి వద్ద ఏర్పాటు చేసిన పైపులు కూడా అనుమతి లేకుండా పెట్టారు. ఇలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకూడదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు మందపురం అనిల్, మంద చంద్రమౌళి, ఎల్.శ్రీనివాస్, షాబుద్దీన్, సోమేశ్వర్, సట్ల చంద్ర శేఖ ర్, సట్ల రాజుకుమార్, ప్రశాంత్, మర్రి రవి, తదితరులు పాల్గొన్నారు.
