నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. పదర మండలం కోడోని పల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందారు. పొలంలో కూలీ పనులకు వెళ్లిన సమయంలో పిడుగులతో కూడిన భారీ వర్షం పడింది. పిడుగుపాటుకు పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను సుంకరి సైదమ్మ (35), ఈదమ్మ (55) గా పోలీసులు గుర్తించారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మకు తీవ్రగాయాలు కాగా.. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఒక్కసారిగా మారిన వాతావరణం …
.రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. కొన్ని జిల్లాల్లో ఎండలు దంచికొడుతుంటే.. మరికొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ లో మండుతున్న ఎండల నుంచి ఉపశమనం లభించింది. అకస్మాత్తుగా మధ్యాహ్నం వేళ వాతావరణం మారి.. చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో పలు చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
మరో నాలుగు రోజలు వర్షాలు
నేటి నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ఉత్తర తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, మరి కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ కూడా జారీ చేసింది. 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఛత్తీస్ గఢ్, నైరుతి మధ్యప్రదేశ్ ప్రాంతాలలో సముద్ర మట్టానికి 1.5 కి.మీల ఎత్తులో చక్రవాత ఆవర్తనం కొనసాగుతోంది. మధ్య మహారాష్ట్ర నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఉత్తర దక్షిణ ద్రోణి ఈ రోజు బలహీనపడింది. ఈ కారణంతోనే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వివరించారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్
ఆరు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజమాబాద్ కామారెడ్డి జిల్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షం పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.