(ఆంధ్రప్రభ, ఇబ్రహీంపట్నం) : అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం (State Government) అత్యంత ప్రాధాన్యమిస్తోందని.. రైతుల క్షేమం, సంక్షేమంతోనే వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర సాకారమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ (District Collector Dr. G. Lakshmisha) అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం మంగళవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది.
ఈ కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ.. రైతు జి.రవీంద్రనాథ్ ఠాగూర్ (Farmer G. Rabindranath Tagore) పొలంలో వరినాట్లు వేసి.. రైతులు అన్నివిధాలా ఎదిగేందుకు మేమంతా వారి వెనుక ఉన్నామనే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ… ప్రతి గ్రామానికీ ప్రత్యేక సమస్యలుంటాయని, ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ, బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సాగునీరు, విత్తనాలు, ఎరువులు, సీసీఆర్‌సీ కార్డులు, పంట రుణాలు.. ఇలా ప్రతి అంశానికి సంబంధించి రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని.. బయోమెట్రిక్ ఆధారిత ఆన్‌లైన్ విధానం (Biometric based online procedure) ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు వినియోగించవద్దని, తెలిసో తెలియకో అలా వినియోగిస్తే నేల నిస్సారమై, సాగుకు పనికిరాకుండా పోతుందన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగుముందులు (Fertilizers and pesticides) వినియోగించాలని సూచించారు. పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుందని..అదేవిధంగా ప్రకృతి సేద్య విధానాలను కూడా అనుసరించాలని సూచించారు. గుంటుపల్లిలో ప్రధానంగా బీపీటీ 5204, ఎంటీయూ 1318, ఎంటీయూ 1262, పీఎల్ 1100 రకాలు పండిస్తున్నారని.. వరికి సంబంధించి మొదటి దఫా యూరియా గుళికలు వేసి తర్వాత రెండు, మూడు విడతల్లో నానో యూరియా (Nano urea) కు ప్రాధాన్యమివ్వాలని.. దీనివల్ల దాదాపు 50 శాతం ఎరువు ఆదా అవడమే కాకుండా సామర్థ్యమూ పెరుగుతోందన్నారు.
జిల్లాలో ఇప్పటికే 39 వ్యవసాయ డ్రోన్లు అందించామని, ఇక్కడ కూడా అవసరం మేరకు డ్రోన్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం లక్ష్యంగా హైటెక్ అగ్రికల్చర్ (Hi-tech Agriculture), ప్రెసిషన్ అగ్రికల్చర్ (Precision Agriculture), మార్కెట్ లింక్డ్ అగ్రికల్చర్ (Market Linked Agriculture) కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. సాగు పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ (91549 70454) అందుబాటులో ఉందని.. కాల్ చేసి సమాచారమిస్తే వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎలాంటి వదంతులు నమ్మొద్దన్నారు. ఎరువులను అధిక ధరలకు అమ్మినా, కృత్రిమ కొరత సృష్టించినా సంబంధీకులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ లక్ష్మీశ హెచ్చరించారు.
ఉద్యాన పంటలతో సిరుల పంట:…
కేవలం వరికి మాత్రమే పరిమితం కాకుండా ఉద్యాన పంటల సాగు దిశగా కూడా ముందుకు సాగాలని.. ఉపాధి హామీ పథకం (Employment Guarantee Scheme) ద్వారా ఉచితంగా పండ్ల, పూల తోటల సాగు చేపట్టి రెండు నుంచి మూడు రెట్ల అధికా ఆదాయం పొందొచ్చని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఈ ఏడాది జిల్లాలో 4 వేల ఎకరాల ఉద్యాన పంటల సాగును లక్ష్యంగా నిర్దేశించుకోగా ఇప్పటికే 3,800 ఎకరాల్లో చేపట్టడం జరిగిందన్నారు. పొలం గట్లపైనా మునగ వంటి పంటలు పండించవచ్చన్నారు. తాజా సమావేశంలో రైతులు తమ దృష్టికి తెచ్చిన వీటీపీఎస్ కాలుష్యం (VTPS pollution), గ్రీన్ బెల్ట్ వంటి వాటిపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.ఈ కార్యక్రమంలో గుంటుపల్లి సర్పంచ్ భూక్యా కవిత, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఏడీ శ్రీనివాసరావు, టెక్ ఏవో వాసుదేవ్ నాయక్, మండల వ్యవసాయ అధికారి యడవల్లి రజని, పీఏసీఎస్ ప్రెసిడెంట్ రామకృష్ణ, స్థానిక ప్రగతిశీల రైతులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.