ఎలిగేడు, మే 20 (ఆంధ్రప్రభ): గత ప్రభుత్వం అమలు చేసిన ధరణి పెద్దల చట్టంగా పని చేసిందని.. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక భూ భారతీ ద్వారా పేదల చట్టం తెచ్చి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద పైలట్ ప్రాజెక్టులో భాగంగా భూ భారతి చట్టం- 2025పై నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు మంత్రి పొంగులేటి రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… గత ప్రభుత్వ పెద్దలు స్వార్థ పూరితంగా నాలుగు గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకోకుండా ధరణి చట్టం తయారు చేశారన్నారు. ప్రజా ప్రభుత్వం దేశంలోనే 18 రాష్ట్రాల్ల్రోనే 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారి కోరిక మేరకు భూ భారతి చట్టం తయారు చేశామన్నారు. రాష్ట్రంలోనే ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించాలని ఎన్నో రాత్రులు శ్రమించి, మేధావులతో చర్చించి, ఒక్క రోజు ఆలస్యం జరిగిన పేదలకు మంచి జరగాలనే తపనతో భూ భారతి చట్టాన్ని తయారు చేశామని తెలిపారు. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవెన్యూ చట్టం తయారు చేయాలన్న ఆదర్శంగా ఉండేలా భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం తయారు చేసిందని, దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం నిలుస్తుందన్నారు గత ప్రభుత్వం ధరణి చట్టం తెచ్చి మూడేళ్లు గడిచినా రూల్స్ తీసుకుని రాలేదని, తమ ప్రభుత్వం భూ భారతి చట్టం రూల్స్ ప్రవేశపెట్టిందని, ఈ నిబంధనల ప్రకారం సాధా బైనామా దరఖాస్తులు పరిష్కారం అవుతాయన్నారు. పెండింగ్ ఉన్న సాధా బైనామా చట్టం సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. గత ప్రభుత్వం సాదా బైనమా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ధరణి చట్టంలో సాదా బైనమా గురించి అసలు పెట్టలేదన్నారు. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్‌ఏ, వీఆర్‌ఓ వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చారని, ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని జూన్ 2 నాటికి నియమిస్తామని తెలిపారు. భూ సరిహద్దులతోపాటు- భూమి కొలతలు పూర్తిగా ఉండేలా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొని వచ్చామన్నారు.
ఐటీ- పరిశ్రమలు శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గతంలో సాగు నీరు కోసం రైతులు పడే ఇబ్బందులకు ప్రతి రోజూ ముందు ఉండి పోరాటం చేసిన నాయకులు నేడు ప్రజాప్రతినిధిగా ఉండటం సంతోషంగా ఉందన్నారు. ఎస్సారెస్పీ డీ- 83, డీ- 86 కాల్వల కింద పూర్తి స్థాయి చివరి ఆయకట్టు- వరకు సాగునీరు అందించడంలో స్థానిక ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారన్నారు. సుల్తానాబాద్, పెద్దపల్లి బైపాస్ రోడ్డు పనులు -టె-ండర్లు పూర్తవుతున్నాయని, త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఎమ్మెల్యే పని చేస్తున్నారని తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని బాగు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చెస్తున్నామన్నారు. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 57 వేల ఖాళీలను సంవత్సర కాలంలో ప్రజా ప్రభుత్వం భర్తి చేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొని వచ్చిందన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ భూ సమస్యలు శాశ్వత పరిష్కారం చేసే దిశగా అంబేద్కర్ జయంతి నాడు ప్రభుత్వం భూ భారతి పోర్టల్ ప్రారంభించిందని, ఈ చట్టంపై సందేహాల నివృత్తి కోసం మండల కేంద్రాలలో అవగాహన సమావేశాలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ఎలిగేడు మండలాన్ని పైలట్‌గా ఎంపిక చేసి రెవెన్యూ సరస్సు నిర్వహిస్తున్నామని, తహసిల్దార్ నేతృత్వంలో 2 బృందాలను ఏర్పాటు చేసి గ్రామాలలో భూ సమస్యలపై ఇప్పటి వరకు 11 గ్రామాలలో దాదాపు 1000 దరఖాస్తులు స్వీకరించి 132 దరఖాస్తులు పరిష్కరించామన్నారు.
ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ… గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి చట్టం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం భూ భారతి చట్టం తీసుకొని వచ్చిందన్నారు. గతంలో ధాన్యం కొనుగోలు పేరుతో రైతులకు చాలా నష్టం జరిగిందని, నేడు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంవత్సరానికి దాదాపు కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట్లాడుతూ… మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం దిశగా ప్రజా పాలనలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పని చేస్తున్నారని తెలిపారు. రామగుండం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు- చేయాలని, నగరానికి అదనంగా మరో తహసిల్దార్ కార్యాలయం మంజూరు చేయాలని, అంతర్గాం కాందిశీకులు సమస్య పరిష్కారం చేయాలని, జెన్కో సింగరేణి తరపున గతంలో 18 వేల పట్టాలు పంపిణీ చేశామని , మరో 17 వేల పట్టాలు పండింగ్ లో ఉన్నాయని , వీటి పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ఎంపిక చేసిన 150 మంది లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.
ఈకార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు ప్రోటోకాల్, పబ్లిక్ రిలేషన్స్ హర్కర వేణుగోపాల్, ఎమ్మెల్సీ టి.భాను ప్రసాద్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య గౌడ్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ- చైర్మన్ స్వరూప, అదనపు కలెక్టర్ డి.వేణు, రెవెన్యూ డివిజన్ అధికారి బి గంగయ్య, తహసిల్దార్ బషీరుద్దీన్, మార్కెట్ చైర్మన్‌లు సంజీవ్, తిరుపతి రెడ్డి, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
