TG | భూమిని కాపాడుదాం – మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు పిలుపు

వికారాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : భూ త‌ల్లిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని, రైతులు యూరియా వాడ‌కాన్ని త‌గ్గించాల‌ని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌రావు అన్నారు. సోమ‌వారం వికారాబాద్ జిల్లా ధారూర్‌లో ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని మంత్రి తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పెస్టిసైడ్స్ వాడకం తగ్గించాలన్నారు. శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి వల్లే వ్యవసాయంలో దిగుబడి పెరిగిందని, అయితే వారు ల్యాబ్‌లలో చేస్తున్న ప్రయోగాల ఫలితాలు పొలాల్లోకి వచ్చేసరికి ఒక తరం పోతుంద‌ని ఆయ‌న చెప్పారు.

ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలి
ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. నాణ్య‌మైన విత్తనాలు, మొక్కలు తెప్పిస్తున్నామని, గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు మూడేళ్లలోనే ఆయిల్ పామ్ సాగులో దిగుబడి వస్తోందన్నారు. ఆలోపు అంతర పంటలు కూడా సాగు చేసుకోవచ్చని సూచించారు. ఇప్పుడు రాష్ట్రమంతటా ఆయిల్ పామ్ సాగుకు అనుమతి ఉందన్నారు. కలెక్టర్లకు నెలకు లక్షరూపాయలే జీతం వస్తే ఆయిల్ పామ్‌ సాగుతో రైతులకు ఎకరానికి అన్ని ఖర్చులు పోను నెలకు రెండు లక్షలు జీతం లెక్క ఆదాయం వస్తుందన్నారు. వరి సాగులోనూ పాక్షికంగా ఆరుతడి విధానం పాటించాలన్నారు.

పంట‌ల బీమాను పున‌రుద్ధ‌రించాలి
గత ప్రభుత్వం పంటల బీమాను పట్టించుకోలేదని, కానీ త‌మ‌ ప్రభుత్వం పంటల బీమాను మళ్లీ పునరుద్ధరించబోతుంద‌ని మంత్రి తుమ్మ‌ల‌ చెప్పారు. ఫసల్ బీమాలో కలుస్తామని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. పంటల బీమా ప్రీమియం అంశంపై త్వరలోనే కేబినేట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రాష్ట్ర ఖజానా పరిస్థితి బాగోలేదన్నారు. అయినా అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో మొదటి పంటకాలంలో రూ. 33 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన సీఎం ఈ దేశంలో రేవంత్ రెడ్డి ఒక్కరేనన్నారు.

Leave a Reply