TG | నేటి నుంచి అమలులోకి వ‌చ్చిన ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ చ‌ట్టం …

హైద‌రాబాద్ -రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ నేటి నుంచి అమలులోకి వ‌చ్చింది. దాదాపు 30ఏళ్లపాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా అమల్లోకి తీసుకొస్తూ ఉత్తర్వులు, నిబంధనలు జారీ చేసింది ప్ర‌భుత్వం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్​ అంబేడ్కర్‌ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ఎస్సీ గ్రూపులు, కులాల వారీగా అందే రిజర్వేషన్ల వివరాలతో జీవో నెంబర్9 ను విడుదల చేసింది . ఈ ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అందించింది ఈ వ‌ర్గీక‌ర‌ణ కోసం వేసిన మంత్రివర్గ ఉపసంఘం.

కాగా, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం హైదరాబాద్‌లో సమావేశమైంది. ఆ భేటీకి మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, ఏకసభ్య కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ సహా పలువురు అధికారులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్బంగా ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దశాబ్దాల నాటి డిమాండ్‌ నెరవేర్చిందనివెల్లడించారు. గతంలో అనేక ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణకి మద్దతుగా తీర్మాణాలు ఆమోదించినా, చట్టపరమైన మద్దతుతో అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మద్దతిచ్చారని మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి తెలిపారు. నేడు వర్గీకరణ ఉత్తర్వులు, విధివిధానాలతో జివోను విడుద‌ల చేసిన‌ట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఉత్తమ్‌ వివరించారు.

2011 జనాభా లెక్కల ప్రకారం విభజన :

రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చాక ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. ప్రస్తుతం 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీలకు 15 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయన్న ఆయన, రాష్ట్రంలోఎస్సీ జనాభా 17.5 శాతానికి పెరిగిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో క్రీమీలేయర్‌ ప్రవేశపెట్టాలన్న కమిషన్‌ సిఫార్సును ఇప్పటికే ప్రభుత్వం తిరస్కరించిందని ఉత్తమ్‌ వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిఫరెన్షియల్​ విధానం :
ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా, సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ప్రిఫరెన్షియల్‌ విధానాన్ని అవలంభించనుంది. ఉదాహరణకు ఎస్సీల్లోని గ్రూప్‌-1 కులాలకు నోటిఫైచేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్‌-2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీచేయాలి. గ్రూప్‌-2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్‌-3లోని అభ్యర్థులతో భర్తీచేయాలి. ఒకవేళ గ్రూప్‌-1, 2, 3 మూడింట్లోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్‌ చేస్తారు. ప్రస్తుతం ప్రిఫరెన్షియల్‌ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకి ఆ విధానం అమలు చేస్తున్నారు. ఎస్సీ అభ్యర్థులకి ఆ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.

Leave a Reply