TG | అస్తిత్వం కోసమే సాంస్కృతిక ప్రదర్శన …అనుమతి నిరాకరణపై మంద కినుక
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అస్తిత్వం కోసమే తమ సాంస్కృతిక ప్రదర్శన అని, దీనికి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందనడం అన్యాయమని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. 30 ఏళ్లలో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించామని, ఎక్కడ శాంతిభద్రత సమస్య రాలేదని చెప్పారు. చెప్పుల తయారీ, డప్పు వాయిద్యం తమకు వారసత్వంగా వచ్చాయన్నారు. తమ మూలాలు కాపాడుకునేందుకు త్వరలో సాంస్కృతిక కార్యక్రమం చేపడతామన్నారు.
ఎప్పుడూ శాంతిభద్రతల సమస్య రాలేదు
ఎమ్మార్పీఎస్ ఉద్యమం 1994లో మొదలుపెట్టామని, 1996 మార్చిలో మొట్టమొదటి బహిరంగసభనిర్వహించామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఉద్యమ విస్తరణ కోసం మొదటి రెండేళ్లు పనిచేశామని, వర్గీకరణ కోసం హైదరాబాద్‌లో ఎన్నో ఆందోళనలు, సభలు నిర్వహించామని గుర్తు చేశారు. లక్షల మందిని సమీకరించినా ఎప్పుడూ సమస్య రాలేదని, ఎమ్మార్పీఎస్ ఎప్పుడూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించలేదని స్పష్టం చేశారు. అలా చేస్తే ఇన్నేళ్లు ఉద్యమం నిలబడేది కాదన్నారు. అస్తిత్వం కోసమే తమ సాంస్కృతిక ప్రదర్శన అని, దీనికి అనుమతిస్తే శాంతిభద్రతల సమస్య వస్తుందనడం అన్యాయమన్నారు. ఆరు అంశాలు చూపుతూ అనుమతి నిరాకరిస్తూ నోటీసులు ఇచ్చారన్నారు. దానికి వివరణ ఇస్తూ మరో వినతిపత్రం ఇస్తామని, గాంధేయ మార్గంలోనే ప్రయాణం కొనసాగిస్తాం. లక్ష డప్పులు, వేయి గొంతుకల కార్యక్రమానికి సీఎం అనుమతి ఇవ్వాలి. ఫిబ్రవరి 7న కార్యక్రమం అనుమతికి మరోసారి వినతిపత్రం ఇస్తామని, గిన్నిస్ బుక్‌లో చోటు దక్కేలా కార్యక్రమం ఉండబోతోందని మందకృష్ణ మాదిగ అన్నారు.