ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటికాదు..
ఉద్యమాల నుంచి ఊపిరి పోసుకున్నవర్గీకరణ
అమరుల ఆశయాలకు కట్టుబడిన ప్రభుత్వం
విజినరీ లీడర్ సీఎం రేవంవత్ రెడ్డి..
సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు
అసెంబ్లీలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఐదో రోజు సీఎం రేవంత్ రెడ్డి తరఫున ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎస్సీ వర్గీకరణ హేతుబద్ధీకరణ బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు చారిత్రాత్మక రోజు అని పేర్కొన్నారు. దళితుల దశాబ్దాల వర్గీకరణ కలను నెరవేరుస్తున్న తమ నాయకుడు, విజినరీ లీడర్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారికి, కేబినెట్ సబ్‌కమిట్ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కి, ఇతర సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలని ఎస్సీ వర్గీకరణ బిల్లుపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రసంగించారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం కోరుతూ ఆయన ప్రసంగించారు. సామాజిక న్యాయ సాధికారతకు బాటలు వేస్తున్న నిబద్దత గల నాయకుడు, దార్శనికుడు తమ ముఖ్యమంత్రి అని పేర్కొంటూ బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలే ఆయన దార్శనికతకు తార్కాణమన్నారు.
వర్గీకరణ డిమాండ్ ఈనాటికాదు…
మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటి కాదని, సాతంత్య్రం వచ్చిన 15 ఏండ్లకే ఈ డిమాండ్ మొదలైందన్నారు. వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయని, ఎంతో మంది త్యాగాలు చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వారందరికీ మాదిగ సమాజం తరపున కృతజ్ఞతలు చెబుతూ అమరవీరులకు జోహార్లు అర్పించారు. అమరుల ఆశయాలను, దశాబ్దాల మాదిగల ఆకాంక్షను ఈ రోజు సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారన్నారు.
సుప్రీం తీర్పు ఇచ్చిన ఆరు నెలల్లోనే…
మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల్లోనే వర్గీకరణ చట్టం చేసుకుంటున్నామన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్, రేవంత్‌రెడ్డి కమిట్‌మెంట్ అని పేర్కొన్నారు. 2025 ఫిబ్రవరి 4వ తేదీ(సోషల్ జస్టీస్ డే), మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. గతంలో ఓసారి వర్గీకరణ చేసినా, కోర్టు తీర్పులతో అది నిలిచిపోయిందని, నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడాలేదన్నారు. కేవలం 1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయన్నారు. మొత్తం మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమే కావడం గమనార్హమన్నారు. మిగిలిన 33 కులాలూ, పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయని చెప్పారు.
దేశాన్ని పీడించిన అంటరానితనం…
మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ ప్రపంచంలో అనేక దేశాల్లో వర్ణ వివక్ష, బానిసత్వం ఉంటే, మన దేశంలో అత్యంత నీచమైన అంటరానితనం ప్రజలను పీడించిందని గుర్తు చేశారు. 19వ శతాబ్దం వరకూ అంటరానితనం బహిరంగంగానే కొనసాగిందన్నారు. ఈ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవం కోసం మహాత్మ జ్యోతిరావు ఫూలె, మహాత్మ గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో పోరాటాలు చేశారన్నారు. తత్ఫలితంగా ఉపశమన చర్యలు, సంఘ సంస్కరణలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 1931లోనే తొలిసారి కుల గణన చేశారని, 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించారని, మహనీయుడు అంబేద్కర్ పోరాట ఫలితంగా దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారని, విద్యతోనే సమాజ పురోగతి, అభివృద్ధి అని నమ్మిన వ్యక్తి అంబేద్కర్, అందుకే విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఆర్థిక స్వావలంభన కోసం ఉద్యోగాలు, పాలనలో భాగస్వామ్యం కోసం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు.
ఇదే వర్గీకరణకు నాంది…
రిజర్వేషన్ల ఫలాలు షెడ్యూల్డ్ కులాల ప్రజలందరికీ వారి వారి జనాభా ప్రాతిపదికన పంపిణీ కాలేదని మంత్రి అన్నారు. ఇదే దళిత సమాజంలో ఆందోళనకు, అసంతృప్తికి కారణమైందన్నారు. 1965లోనే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు బీఎన్ లోకూర్ కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని నాడే ఆ కమిటీ గుర్తించిందన్నారు. తమ వాటా తమకు, తమ హక్కులు తమకు కావాలని ప్రజలు ఆందోళన చేయడంతో 1975లోనే పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది. 1990వ దశకం నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉదృతమైందన్నారు. ఫలితంగా నాటి ప్రభుత్వం జస్టీస్ రామచంద్రరాజు గారి నేతృత్వంలో 1996లో కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, వెనుకబాటుతనం, జనాభా, చారిత్రక నేపథ్యం ఆధారంగా షెడ్యూల్డ్ కులాలను నాలుగు గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించింది.
కమిషన్ సూచనల మేరకు 2000లో షెడ్యూల్డ్ కులాలను ఏబీసీడీ గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. అత్యంత వెనుకబడిన రెల్లి, దాని ఉపకులాలను గ్రూప్ ఏలో చేర్చి, వారికి కమిషన్ సూచనల ప్రకారం అదనపు ప్రయోజనం కల్పించారన్నారు. వారి జనాభా ప్రకారం 0.25 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండగా, 1 శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. దీన్నే ప్రిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ అన్నారు.
నాడు కోర్టు కేసులతో ఆగిన వర్గీకరణ
మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి వర్గీకరణ ఆగిపోయిందన్నారు.
2006లో దవిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్, కేసుతో పంజాబ్‌లోనూ వర్గీకరణ ఆగిపోయిందన్నారు. నాటి నుంచి గతేడాది వరకూ వర్గీకరణ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిందన్నారు. 2023 డిసెంబర్‌లో ప్రజలందరి దీవెనతో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆ వెంటనే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ కేసులో, వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్‌ను నియమించామన్నారు. సుదీర్ఘ విచారణ, వాదోపవాదనల అనంతరం గతేడాది ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తుది తీర్పును ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చునని పేర్కొందన్నారు. వర్గీకరణకు ఎంపిరికల్ డేటాను ప్రమాణికంగా తీసుకోవాలని చెప్పింది.
వర్గీకరణ లేకుండా, షెడ్యూల్డ్ కులాలలోని అత్యంత అణగారిన వర్గాలు రిజర్వేషన్లలో వారి చట్టబద్ధమైన వాటాను పొందలేరని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడానికి, చట్టాలను రూపొందించడానికి ఆర్టికల్ 341 అడ్డురాదని స్పష్టం చేసిందని చెప్పారు. రాజకీయ కారణాలతో కాకుండా, అందరికీ న్యాయం జరిగేలా వర్గీకరణ చేయాలని సూచించిందని అన్నారు. ఇందుకోసం అక్షరాస్యత, వృత్తి, జనాభా, ఉద్యోగవకాశాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రమాణికంగా తీసుకోవాలని ఆదేశించింది. దీన్నే సుప్రీంకోర్టు ఎంపిరికల్ డేటాగా వర్ణించిందని, ఎంపిరికల్ డేటా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని అన్నారు.
తీర్పు వచ్చిన గంటలోపే…
మంత్రి రాజనర్సింహా మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిగారు ప్రకటన చేశారని గుర్తు చేశారు. దేశంలో వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలుస్తామని ప్రకటన చేశారు. ఇచ్చిన మాటను నిలుపుకునే లక్షణం తమ నాయకుడిదని, సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించి, వర్గీకరణను అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించారన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన సబ్ కమిటీ, దీనిపై మరింత అధ్యయనం అవసరం అని భావించిందన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయించాలని సూచించిందన్నారు. రిటైర్డ్ జడ్జి, జస్టీస్ షమీమ్ అక్తర్ చైర్మన్‌గా వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందని, రాష్ట్రంలోని పాత పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను కమిషన్ తెలుసుకుందన్నారు. ప్రజల నుండి మొత్తం ఎనిమిది వేలకుపైగా విజ్ఞాపనలను కమిషన్ స్వీకరించిందన్నారు. ఎస్సీల జనాభా, అక్షరాస్యత, ఉపాధి,విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక స్థితిగతులు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిందన్నారు. 82 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, 199 పేజీల నివేదికను ఫిబ్రవరి 3, 2025 న ప్రభుత్వానికి సమర్పించిందని చెప్పారు.