దాడి చేసి పట్టుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు
రోగాలు తగ్గిస్తామనే తప్పుడు ప్రచారంపై డీసీఏ కన్నెర్ర
స్టోన్ నిల్ సిరప్, మహా సుదర్శన్ కధా స్వాధీనం
మార్కెటింగ్ కంపెనీలపై కేసు నమోదు
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
మూత్ర పిండ వ్యాధులు.. జర్వాన్ని తగ్గిస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్న రెండు సంస్థలపై డ్రగ్ కంట్రోల్ అధికారులు కన్నెర్ర చేశారు. మల్కజ్ గిరి, హనుమకొండల్లోని ఈ సంస్థలపై దాడులు నిర్వహించి కేసు నమోదు చేశారు. అలాగే తప్పుడు ప్రచారంతో ప్రజలకు చేరనున్న మందులను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో గండిమైసమ్మ డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ హేమలత, కిరణ్ కుమార్ పాల్గొన్నారు. హర్యానాలో పంచకుల జిల్లా, సాకేత్రిలో ప్లాట్ నెం.436 లో అల్ట్రా గ్రీన్ (యూనిట్-I), మూత్రపిండ కాలిక్యులి, యురేత్రల్ కాలిక్యులి వ్యాధులకు స్టోన్ నిల్ డీఎస్ సిరప్ పేరిట ఆయుర్వేద మందును ఉత్పత్తి చేస్తోంది. దుండిగల్ సమీపంలోని బౌరంపేటలో మారోవిన్ హెల్త్ కేర్ సంస్థ మార్కెటింగ్ చేస్తున్న విషయాన్ని డ్రగ్ కంట్రోల్ అధికారులు పసిగట్టి దాడులు చేశారు.
తప్పుడు ప్రకటనలతో బురిడీ..
మహాసుదర్శన్ కధా పేరుతో ఆయుర్వేద ఔషధాన్నిజ్వరం చికిత్సకు వినియోగిస్తున్నారు. ఈ ఔషధాన్ని బెంగళూరులో పాత మద్రాసు రోడ్డులోని 12వ మైలు రాయి సమీపంలోని ఓం ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ తయారు చేస్తుండగా.. ముంబైలోని 135, నానుభాయ్ దేశాయ్ ఆర్డి., ఖేతవాడి చిరునామాలో శ్రీ ధూతపాపేశ్వర్ లిమిటెడ్ కంపెనీ మార్కెటింగ్ చేస్తోంది. ఈ ఔషధాన్ని హనుమకొండలో డ్రగ్ ఇన్స్ పెక్టర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాట్లాడుతూ.. డ్రగ్స్ అండ్ మ్యాజిక్ రెమెడీస్ చట్టం 1954 ప్రకారం ఈ ఔషధాల గురించి అభ్యంతరకర ప్రకటనలు నిషేధం చేసినట్టు తెలిపారు. మూత్రపిండాలు, జ్వరం వ్యాధులు/ రుగ్మతలకు సంబంధించిన ప్రకటనల ప్రచురణలో ఏ వ్యక్తి కూడా పాల్గొనకూడదన్నారు. తప్పుదోవ పట్టించే అభ్యంతరకర ప్రకటనలతో మార్కెట్లోకి తరలిస్తున్న మందులను గుర్తించేందుకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దాడులు చేశారు. మల్కజ్ గిరి జిల్లా బౌరంపేట, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో స్టోన్ నిల్ డీఎస్ సిరప్‌ను, హనుమకొండలో మహాసుదర్శన్ కదా ఆయుర్వేద ఔషధాలను స్వాధీనం చేసుకున్నారు. మార్కెటింగ్ కంపెనీలపై కేసు నమోదు చేశారు.