హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం..

హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : గర్భాశయ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే హెచ్‌పీవీ వ్యాక్సిన్ కేంద్రాన్ని అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రముఖ సీనియర్ వైద్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఉప్పునుంతల మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 9 నుంచి 14 సంవత్సరాల బాలికలకు హెచ్‌పీవీ టీకాలను ఉచితంగా అందిస్తున్నాయని తెలిపారు. క్యాన్సర్ కారక వైరస్‌ల నుంచి రక్షణ కల్పించే ఈ టీకాలను ప్రతి ఆడబిడ్డ తప్పనిసరిగా వేయించుకోవాలని తల్లిదండ్రులను కోరారు.

ప్రభుత్వం అందిస్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని మహిళా వైద్యులు, నర్సులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాసులు, జిల్లా వైద్యాధికారి రవికుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి రజిత మల్లేష్, మండల పార్టీ అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, వైద్యులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

