TG | ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్..

TG | ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెండ్..
TG | ఆసిఫాబాద్, ఆంధ్రప్రభ : ఆసిపాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ బి. వినోద పై వచ్చిన సమాచారం పై జిల్లా కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా కళాశాలను సందర్శించిన సమయంలో ప్రిన్సిపాల్ విధులకు గైర్హాజరు కావడం, ప్రిన్సిపల్ కార్యాలయ గదికి తాళం వేసి ఉందని, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులతో విచారణ జరిపినప్పుడు, ప్రిన్సిపాల్ ఈ నెల 29వ తేదీ నుండి తన చట్టబద్ధమైన విధులకు హాజరు కాలేదని, ఆసిఫాబాద్‌లో లేరని తెలిసిందని.. ప్రధాన కార్యాలయాన్ని వదిలి వెళ్లేందుకు ప్రిన్సిపల్ ఎలాంటి ముందస్తు అనుమతి పొందలేదని తెలిపారు.
డిసెంబర్-2025లో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు విద్యా తరగతులు ప్రారంభించలేదని విద్యార్థులు, అధ్యాపకులచే నిర్ధారించబడిందని తెలియచేశారు. విద్యార్థులు అపరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉంటున్నారని, వారికి నాణ్యత లేని ఆహారం ఇస్తున్నారని గమనించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులతో శుభ్రపరిచే పనులు, ప్రిన్సిపాల్ వ్యక్తిగత పనులు, వీధి కుక్కలు, పిల్లులకు ఆహారం పెట్టడం, వాటి పోషణ వంటి అంశాల పై ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు ఫిర్యాదు చేశారని చెప్పారు. విద్యార్థినుల వసతి గృహంలో సి.సి. కెమెరా అమర్చడం జరిగిందని, విద్యార్థినులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఈ కారణంగా ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయడం జరిగిందని, క్రమశిక్షణా చర్యలు ముగిసే వరకు/క్రిమినల్ అభియోగాలకు సంబంధించిన అన్ని చర్యలను ముగించే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని తెలిపారు. ఈ కాలంలో ప్రిన్సిపల్ బి.వినోద జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండాలని, ముందస్తు అనుమతి పొందకుండా ప్రధాన కార్యాలయం నుండి బయటకు వెళ్లకూడదని తెలిపారు.
