కావలి – పహల్గామ్ ఉగ్రదాడిలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, కావలికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మధుసూధన్ రావు మృతి చెందిన విషయం విదితమే. బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న మధుసూధన్ రావు తన భార్య, పిల్లలతో కలిసి జమ్మూకశ్మీర్‌కు విహారయాత్రకు వెళ్లగా, ఉగ్రవాదుల దాడిలో దుర్మరణం చెందాడు.
అతని భౌతికకాయం కావలికి చేరుకుంది. కుమ్మరవీధిలో ఆయన తల్లిదండ్రులు తిరుపాల్, పద్మావతి నివాసముంటున్నారు. వీరు స్థానికంగా అరటిపళ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. మధుసూధన్ రావు భౌతికకాయం బుధవారం రాత్రి చెన్నై విమానాశ్రయం చేరుకుంది. అక్కడి నుంచి గురువారం ఉదయం రోడ్డు మార్గం ద్వారా కావలికి తీసుకువచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

స్థానిక అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు అక్కడకు చేరుకుని మధుసూదన్ రావు భౌతికకాయానికి నివాళులర్పించారు. మధుసూధన్ రావు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. నేడు ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.