అభ్యంతరం తెలిపిన విపక్షాలు
నినాదాలు, గందరగోళం మధ్య బిల్లు పాస్
నివేదికపై విపక్ష పార్టీల ఎంపీల నిరసన
అసమ్మతి నోట్‌ను తొలగించారని ఆందోళన
ప్రతిపక్ష సభ్యులు సూచించిన వాటికి నో చెప్పిన కమిటీ
14 సవరణలను ఆమోదించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : వక్ఫ్ సవరణ బిల్లు-2024పై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) రూపొందించిన నివేదికను కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. జేపీసీకి చైర్మన్‌గా వ్యవహరించిన జగదంబికా పాల్, బీజేపీ ఎంపీ సంజయ్ తదితరులు ముసాయిదా బిల్లుపై తమ నివేదికను హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సభ ముందుకు తీసుకొచ్చారు. బిల్లుపై నివేదికను రాజ్యసభ ఎంపీ మేధా కులకర్ణి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. నివేదికపై విపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు నిరసన తెలిపారు. తాము సమర్పించిన డిస్సెంట్ (అసమ్మతి) నోట్‌ను తొలగించారని నిరసనకు దిగారు. సభలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ 20 నిమిషాల పాటు వాయిదా వేశారు. అనంతరం సభ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ విపక్షాలు తమ నిరసనను కొనసాగించాయి. విపక్షాల నిరసనల మధ్యే ఈ నివేదికకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
14 సవరణలను ఆమోదించిన కమిటీ..
కాగా, జనవరి 29వ తేదీన ముసాయిదా నివేదికను సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఆమోదించింది. 15-11 మెజారిటీ ఓటుతో ముసాయిదా చట్టానికి సబంధించిన నివేదికను, బీజేపీ సభ్యులు సూచించిన 14 సవరణలను కమిటీ ఆమోదించింది. అయితే.. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఆప్, శివసేన (యూబీటీ), ఏఐఎంఐఎంతో సహా ప్రతిపక్ష సభ్యులు సూచించిన ప్రతి మార్పును కమిటీ తిరస్కరించింది. కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక సభ్యుడు ఉంటారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అఘాఖానీ, బొహ్రా వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసే నిబంధనలు కూడా సవరణలలో ఉన్నాయి. వక్ఫ్ అలాల్ ఔలాద్ (కుటుంబ వక్ఫ్‌లు)లో మహిళల వారసత్వ హక్కులను రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించే నిబంధనలు ఉన్నాయి.
వక్ఫ్ బోర్డుల నిర్వహణలో కేంద్రం జోక్యం – విపక్షాలు
అయితే.. ఈ నివేదికపై ప్రతిపక్ష సభ్యులు తమ డిస్సెంట్ (అసమ్మతి) నోట్‌ను సమర్పించారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు ఉద్దేశం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో ఆధునికతను, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తీసుకురావడమని బీజేపీ సభ్యులు వాదించగా, ఇది ముస్లిం సమాజం రాజ్యాంగ హక్కులపై దాడిగా, వక్ఫ్ బోర్డుల నిర్వహణలో జోక్యంగా ప్రతిపక్ష సభ్యులు అభివర్ణించారు.