హైకోర్టు డ్రైవర్ పై దురుసు ప్రవర్తన
- వీఆర్ కు సాగనంపిన ఆఫీసర్లు
- మంగళగిరి రూరల్ సీఐకి షాక్
గుంటూరు ( మంగళగిరి), ఆంధ్రప్రభ : మంగళగిరి (Mangalagiri) రూరల్ సీఐ శ్రీనివాసరావు ను వీఆర్ కు పంపుతూ గుంటూరు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 27వ తేదీన విధుల్లో ఉన్న హైకోర్టు డ్రైవర్ లక్ష్మీ నారాయణ పై రూరల్ సీఐ శ్రీనివాసరావు చేయి చేసుకుని అసభ్య పదజాలంతో దూషించారు. అంతటితో ఆగకుండా ఇద్దరు కానిస్టేబుళ్లను పిలిపించి హైకోర్టు డ్రైవర్ లక్ష్మి నారాయణ తో పాటు హైకోర్టు కేసుల ఫైల్స్ ఉన్న వాహనాన్ని సైతం రూరల్ స్టేషన్ కు తరలించాలని ఆదేశించారు. హైకోర్టు కేసుల ఫైళ్లు జడ్జిలకు అందజేయడం అత్యవసరమని డ్రైవర్ లక్ష్మీ నారాయణ వేడుకున్నా రూరల్ సీఐ శ్రీనివాసరావు ఏ మాత్రం ఖాతరు చేయలేదు.
తనపై జరిగిన దాడి ఘటనను లక్ష్మీ నారాయణ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆయన సెల్ ఫోన్ ను సైతం బలవంతంగా లాక్కొన్నారు. స్టేషన్ కు వెళ్లాక కూడా ఫోన్ అడిగినా ఇవ్వలేదు. వ్యాన్ లో అత్యవసర ఫైళ్ల గురించి చెప్పగా అంత అత్యవసరమైతే జడ్జీలే ఫోన్ చేస్తారు లే అంటూ కానిస్టేబుళ్లు దురుసుగా మాట్లాడారు. లక్ష్మీ నారాయణ కొద్దిసేపు బ్రతిమిలాడిన తరువాత ఆయనకు ఉన్నతాధికారి ఫోన్ నెంబరు రాసుకునేందుకు సెల్ ఫోన్ ఇచ్చారు.
నెంబరు రాసుకుని మరో వ్యక్తి ఫోన్ నుంచి జరిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం లక్ష్మినారాయణ ను పంపించి వేశారు. తనపై మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు చేయి చేసుకోవడంపై లక్ష్మినారాయణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఎట్టకేలకు మంగళగిరి రూరల్ పోలీసులు బీఎన్ ఎస్ సెక్షన్ 132, సెక్షన్ 115(2) ల కింద కేసు నమోదు చేశారు. ఈనేపథ్యంలో రూరల్ సీఐ శ్రీనివాసరావు ను వీఆర్ కు పంపుతూ జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.