Exclusive | తెల్ల కల్లు కల్లోలం – ప్రాణాల కంటే కమీషన్ లకే ప్రాధాన్యం

సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో కల్తీ కల్లు దందా బయటపడింది. అయిదు దుకాణాల్లోని కల్లు నమూనాలను పరీక్షించగా, నాలుగు చోట్ల అల్ఫ్రాజోలం కలిపినట్లు అధికారులు తేల్చారు. అక్రమాలు జరుగుతున్నా పట్టించుకోలేదని బాలానగర్ ఆబ్కారీ సీఐపై సస్పెన్షన్ వేటు పడగా, మరికొందరిపైనా ఉన్నతాధికారుల విచారణ జరుగుతోంది. ఆబ్కారీ శాఖ అధికారుల డొల్ల తనిఖీలతోనే నిరుపేదలు మరణించారని విమర్శలు వినిపిస్తున్నాయి.

సాధారణంగా చెట్ల నుంచి సేకరించిన కల్లును మాత్రమే లైసెన్స్ పొందిన దుకాణాల్లో విక్రయించాల్సి ఉన్నా, ఆ నిబంధనలను పట్టించుకోకుండా నిర్వాహకులు కల్తీ కల్లు దందాకు పాల్పడుతున్నారు. తెలుపురంగు కోసం క్రీము, నురుగు కోసం కరక్కాయ పొడి, మత్తు కోసం అల్ఫ్రాజోలం, క్లోరోహైడ్రేట్ వంటి ప్రమాదకర రసాయనాలు కలుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. అడ్డగోలు వసూళ్లతో ఆబ్కారీ సిబ్బంది మౌనం వహించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

తాటి చెట్లు లేకున్నా కల్లు..రాష్ట్రంలో టీఎఫ్టీ (టాడీ ఫర్ ట్యాపర్స్), టీసీఎస్ (టాడీ ట్యాపర్స్ కో-ఆపరేటివ్ సొసైటీ)లు తెల్ల కల్లు అమ్మేందుకు ప్రభుత్వం లైసెన్సులు ఇస్తుంది. తాటి, ఈత చెట్ల నుంచి తీసిన కల్లును సొసైటీల ద్వారా విక్రయించుకోవచ్చు. ఆయా టీఎఫ్టీలు, టీసీఎస్లకు వాటి పరిధిలో తాటి వనాలు, ఈత వనాల కేటాయింపు ఉంటుంది. ఊళ్లల్లో ఉండే టీఎఫ్టీలకు కావాల్సినన్ని చెట్లు అందుబాటులో ఉండటంతో కల్తీ పెద్దగా జరగడం లేదు.

అదే నగరాల్లో మాత్రం తాటి చెట్లు సరిపడా లేక దుకాణాల నిర్వాహకులు కల్తీకి తెరతీస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కల్తీ దందా ఎక్కువగా నడుస్తోంది. కొందరు అల్ఫ్రాజోలం, క్లోరల్ హైడ్రేట్, డైజో ఫామ్ కలిపి కల్లు తయారు చేస్తుండగా.. మరికొందరు ఏకంగా రసాయనాలతో కృత్రిమ (సింథటిక్) కల్లును తయారు చేస్తున్నారు

.కిలోకు రూ.10-15 లక్షల ధర అల్ఫ్రాజోలం ఎక్కువగా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఫార్మా కంపెనీల్లో తయారవుతుండగా, మహారాష్ట్రలోనూ కొన్ని ముఠాలు తయారు చేసి తెలంగాణకు సరఫరా చేస్తున్నాయి. కిలో ₹10-15 లక్షలకు ఇక్కడి దుకాణదారులకు అమ్ముతున్నట్టు తెలుస్తోంది.

10 గ్రాముల అల్ఫ్రాజోలంతో ఏకంగా 1200 సీసాల తెల్ల కల్లు తయారు చేస్తూ.. ఇక్కడి నిర్వాహకులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురి కాగా, టీజీఏఎన్బీ దర్యాప్తు చేసి ఈ భారీ రాకెట్ను ఛేదించింది. మహారాష్ట్రలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న పరిశ్రమలను గుర్తించి వాటిని సీజ్ చేయించారు.

శాంపిల్స్ తీసుకునేటప్పుడే కమీషన్..

ప్రతి కల్లు దుకాణంలో నియమ నిబంధనల ప్రకారం రోజువారీగా కల్లు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపి పరీక్షించాలి. ఫలితాలను బట్టి కల్లు దుకాణాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. కానీ ఆబ్కారీ సిబ్బంది అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నమూనాల సేకరణ నుంచే మామూళ్ల దందా మొదలవుతున్నట్టు తెలుస్తోంది. రోజూ ఆయా ఠాణాల పరిధిలోని కల్లు దుకాణాలకు వెళ్లి సిబ్బంది నమూనాలు సేకరించేటప్పుడే కమీషన్లు అందుకుంటున్నట్లు సమాచారం. కల్తీ జరగని లేదా అల్ఫ్రాజోలం వంటి మత్తు పదార్థాలు కలపని నమూనాలనే సిబ్బంది సేకరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

ప్రతి నెలా కమీషన్లు ..

ప్రతి నెలా ఒక్కో కల్లు దుకాణం నుంచి స్థానిక ఆబ్కారీ ఠాణాకు కమీషన్లు వెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. తక్కువ గిరాకీ ఉండే దుకాణం నుంచి నెలకు కనిష్ఠంగా ₹20 వేలు, ఎక్కువ గిరాకీ ఉంటే ఏకంగా ₹లక్షకు పైగా కమీషన్ వెళ్తున్నట్లు సమాచారం. మద్యం పర్మిట్ రూములు నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడం, పబ్బులు, ప్రైవేట్ ఈవెంట్ల నిర్వహణకు వసూళ్ల కంటే కల్లు దుకాణాల వద్ద అదనంగా వసూళ్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాంతాన్ని బట్టి ఈ వసూళ్ల దందా ₹కోట్లలో ఉంటుందని సమాచారం.

రాజేంద్రనగర్ పరిధిలో..రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని ఓ కల్లు దుకాణం భారీ వ్యాపారం చేస్తుంది. మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, కార్వాన్, ఆసిఫ్‌నగర్, మైలార్‌దేవ్‌పల్లి వంటి ప్రాంతాల నుంచి వందలాది మంది అక్కడకి వచ్చి కల్లు తాగుతారు. ఇక్కడ పెద్ద మొత్తంలో కల్తీ దందా నడుస్తున్నందుకు నెలవారీగా సుమారు ₹లక్షకు పైగా స్థానిక ఆబ్కారీ ఆఫీసర్లకు ముట్టజెప్తున్నట్టు తెలుస్తోంది.

ఇది కేవలం స్టేషన్‌కు వెళ్లే కమీషన్ మాత్రమేనని, అధికారులకు మరో వాటా ప్రత్యేకంగా వెళ్తుందని కొందరు సిబ్బంది బహిరంగంగా చెబుతుండడం విశేషం.నెలవారీ మామూలుతోపాటు.. అదనంగామానసిక చికిత్సకు చెందిన ప్రముఖ ఆసుపత్రి ఉండే ప్రాంతంలో మామూళ్లు ఇచ్చేందుకు కల్లు దుకాణాల నిర్వాహకులే సిండికేట్‌గా మారారు. నాలుగైదు కల్లు దుకాణాల నిర్వాహకులంతా కలిపి స్థానిక ఆబ్కారీ స్టేషన్‌కు ₹50 వేల నుంచి ₹75 వేల మధ్య మామూళ్లు ముట్టజెబుతున్నట్టు తెలుస్తోంది. అవి కాకుండా, సిబ్బందిని చూసుకోవాల్సి ఉంటుంది.

అడపా దడపా కల్లు దుకాణాల్లో నేరాలు జరగడం, మత్తు ఎక్కువై కుప్పకూలడం వంటి ఘటనలు జరిగితే అదనంగా చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం.కల్లు దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు.. ఆబ్కారీ శాఖలో పాతుకుపోయిన అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఉన్నాతాధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

పరిస్థితి ఇలాగే కొనసాగితే, అమాయక ప్రజలు కల్తీ కల్లు తాగి ప్రాణాలను కోల్పోయే పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. అయితే.. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో అప్రమత్తమైన ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అనుమతి లేకుండా నడుస్తున్న కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మూడు బృందాలతో సోదాలు జరిపారు. శేర్లింగంపల్లి, మూసాపేట్, బాలానగర్, కైత్లాపూర్, ముషీరాబాద్, కాచిగూడలో ఉన్న కల్లు డిపోలపై దాడులు చేపట్టారు.ఇకమీదట కఠినచర్యలుంటయ్..శేర్లింగంపల్లిలోని సిద్దిక్ నగర్‌లో ఒక కల్లు కాంపౌండ్ అనుమతి లేకుండా నడుస్తున్నట్లు టాస్క్ఫోర్స్ బృందం గుర్తించింది.

ఆ కాంపౌండ్‌ను సీజ్ చేయడంతో పాటు దుకాణ యజమానిపై కేసు నమోదు చేశారు. అన్ని కాంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించి నారాయణగూడలోని ల్యాబ్‌కు పంపించారు. కేవలం అధికారిక డిపోల నుంచి వచ్చే కల్లును మాత్రమే స్టోరేజ్ చేసి విక్రయించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఏ చిన్న తప్పుచేసినా, ఉపేక్షించమని, పట్టుబడితే లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply