ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ హడ్ హక్ కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన ఎన్టీఆర్ అనేక అమూల్యమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి పేదల జీవన విధానాన్ని మార్చారని కొనియాడారు.

పటేల్-పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు మేలు చేకూర్చారని, రెండు రూపాయల కిలో బియ్యం పథకం, పింఛన్ల వంటి పథకాలను ప్రారంభించిన అరుదైన నాయకుడని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు.

కూడు, గూడు, గుడ్డ వంటి పథకాల ద్వారా పేదల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. సంక్షేమ పథకాల అమలుకు ఎన్టీఆర్ ఆద్యుడని మధుసూదన్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆంజనేయులు, కృష్ణమూర్తి, రంగప్ప, వెంకటేశు, తమ్మిరెడ్డి, వాకిటి తిప్పన్న, శేఖర్, గోపి, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply