అభువృద్దికి సహకరిస్తారే తప్పా అడ్డుకోరు..

అభువృద్దికి సహకరిస్తారే తప్పా అడ్డుకోరు..

మక్తల్, ఆంధ్రప్రభ : అభివృద్ధికి సహకరించడం తప్ప అడ్డుకునే తత్వం పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే. అరుణమ్మది కాదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. జూరాల వద్ద ఇరిగేషన్ నిధులతో లో లెవల్ బ్రిడ్జి నిర్మాణం,ఆత్మకూరు కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం విషయంలో అరుణమ్మ మాటలను వక్రీకరించి అభివృద్ధిని అడ్డుకుంటున్నారంటూ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలతో కలిసి మాట్లాడడం మంత్రి స్థాయికి తగదని అన్నారు. మరోసారి మంత్రి అరుణమ్మ మాట్లాడిన వీడియోలను చూడాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.

సోమవారం ఆయన మక్తల్ లో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ బాధ్యత కలిగిన మంత్రిగా ధర్నాలు చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ఉసికొల్పడం మంత్రికి తగదని అన్నారు. ఒకవేళ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేయవలసి వస్తే ఆత్మకూరు రెవిన్యూ డివిజన్ విషయంలో, ఆత్మకూరులో మినీ బస్ డిపో ఏర్పాటు విషయంలో, ట్యాంక్ బండ్ నిర్మాణం విషయంలో, పరమేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి విషయంలో, 50 పడకల ఆసుపత్రి నిర్మాణం విషయంలో మాట తప్పిన ముఖ్యమంత్రి,మంత్రి విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేయవలసి ఉంటుందని అన్నారు.

అంతే తప్ప అరుణమ్మకు వ్యతిరేకంగా ధర్నా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఆత్మకూరు కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం వల్ల అరుణమ్మతో సహా బీజేపీ శ్రేణుక సర్షిస్తారే తప్ప అడ్డుకోవాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని అన్నారు. ఇప్పటివరకు ఆత్మకూరు అభివృద్ధి కోసం మంత్రి ఎన్ని నిధులు తెచ్చారు ఏ పనులను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జరిగిన అభివృద్ధి లేదు అడ్డుకున్న పరిస్థితి లేదని అలాంటప్పుడు బీజేపీ పై మంత్రి బట్ట కాల్చి మీద వేయడం ఆయన స్థాయికి తగదని అన్నారు.

జూరాల బ్రిడ్జి సేఫ్టీ కోసం లో లెవల్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని అరుణమ్మ మాట్లాడేరే తప్ప ఆత్మకూరు కొత్తపల్లి బ్రిడ్జి అవసరం లేదని ఎక్కడ అనలేదు అన్నది వాస్తవమని అన్నారు. కొత్తపల్లి బ్రిడ్జి వల్ల ఆత్మకూరు గద్వాల ప్రాంతాలకు రాకపోకలు సులభతరం అవడమే కాకుండా వ్యాపార పరంగా ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే. అరుణమ్మ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తారే తప్ప ఎక్కడ అభివృద్ధిని అడ్డుకోవాల్సిన అవసరం లేదన్నారు.

అభివృద్ధిని అడ్డుకునే దుస్థితి కాంగ్రెస్ పార్టీది తప్పా బీజేపీది కాదని ఆయన పేర్కొన్నారు .ఇకనైనా నిందలు వేయడం మానుకొని నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రి వాకిటి శ్రీహరి పాటుపడాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా ఆత్మకూరు అభివృద్ధి విషయంలో మంత్రిని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి సూచించారు.

Leave a Reply