ఆర్థిక సాధికార‌త‌కు స్వ‌యం ఉపాధి చేయూత‌…

ఆర్థిక సాధికార‌త‌కు స్వ‌యం ఉపాధి చేయూత‌…

రైజ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, వ‌ర్క్‌షాప్‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోండి
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మ‌హిళ‌ల ఆర్థిక సాధికార‌త‌కు, సుస్థిర భ‌విష్య‌త్తుకు స్వ‌యం ఉపాధి మార్గాలు చేయూత‌నిస్తాయ‌ని ఈ నేప‌థ్యంలో రైజ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, వ‌ర్క్‌షాప్‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శ‌నివారం గుంటుప‌ల్లిలోని రైజ్ కేంద్రం ఆధ్వ‌ర్యంలో న‌డుస్తున్న టైల‌రింగ్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని ప‌రిశీలించారు. రోజుకు రెండు బ్యాచ్‌లు చొప్పున 30 రోజుల పాటు జ‌రిగే శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌హిళ‌ల‌తో మాట్లాడి.. శిక్షణ ప్రగతి, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ మాట్లాడుతూ మహిళలు నేర్చుకున్న నైపుణ్యాలను ఉపాధిగా మార్చుకుని ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ, సహాయక కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలు పొందుతున్న శిక్షణను కేవలం నేర్చుకోవడానికే పరిమితం కాకుండా, ఆచరణలోకి తీసుకువచ్చి ఆదాయ మార్గాలుగా మార్చుకోవాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలను వినియోగించుకుని పారిశ్రామిక‌, వ్యాపార యూనిట్లు ప్రారంభించాల‌న్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. గొల్ల‌పూడిలోని డీఆర్‌డీఏ కార్యాల‌య ఆవ‌ర‌ణంలో జ‌రుగుతున్న బ్యూటీషియ‌న్ శిక్ష‌ణ కార్య‌క్ర‌మాన్ని కూడా ప‌రిశీలించారు.

మ‌హిళ‌ల‌కు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా స్వ‌యం ఉపాధిని ప్రోత్సహించేందుకు కృషిచేస్తున్న జ‌న్ శిక్ష‌ణ్ సంస్థాన్ (జేఎస్ఎస్‌) ఈ కార్య‌క్ర‌మానికి ఊత‌మిచ్చింది. కార్య‌క్ర‌మంలో భాగంగా రాష్ట్రంలో స్థిర‌మైన వ్యాపారాల విస్త‌ర‌ణ‌కు స‌హ‌కారి అయిన సంపన్న‌కారి కార్య‌క్ర‌మానికి సంబంధించిన పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించారు. టాప్ – 150 స్వ‌యం స‌హాయ‌క సంఘాల వ్యాపారాల‌కు ఇంక్యుబేష‌న్ స‌హ‌కారం ల‌భించే ఈ కార్య‌క్ర‌మానికి ఏప్రిల్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. రూ. 15 ల‌క్ష‌ల వ‌ర‌కు గ్రాంట్లు, దిశానిర్దేశం, వ్యాపార ప‌రిధిని పెంచుకునేందుకు ఈ కార్య‌క్ర‌మం వీలుక‌ల్పిస్తుంది. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ ఏఎన్‌వీ నాంచార‌రావు, జేఎస్ఎస్ డైరెక్ట‌ర్ పూర్ణిమ‌, రిసోర్స్ ప‌ర్స‌న్ వై.భ‌వాని త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply