అంబరాన్నంటిన శ్రీరాముని జ‌న్మోత్స‌వ‌ సంబరాలు…

అంబరాన్నంటిన శ్రీరాముని జ‌న్మోత్స‌వ‌ సంబరాలు…

వెండిఉయ్యాలో శ్రీరాముని విగ్రహానికి ఉంచి నామకరణం

జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామాలయం (శ్రీ గోవింద్ మహారాజ్ మఠ్ సంస్థాన్)లో శ్రీ రాముని జన్మోత్సవ సంబరాలు అంబరాన్నిఅంటాయి. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సమర్థరామదాసు పరంపరలో భాగంగా శ్రీరాముని ఆలయంలో మొదటి రోజు శ్రీరాములవారి జన్మమహోత్సవ కార్యక్రమం, రెండవరోజు శ్రీ సీతారాముల కళ్యాణం ఉత్సవం జరుగుతుంది.

మొదటి రోజు జన్మఉత్సవం కార్యక్రమంలో భాగంగా మఠాధిపతి శ్రీ గోపాల్ గోవింద్ మహారాజ్, శ్రీ కేశవ్ మహారాజ్, శ్రీ గోవింద్ మహారాజ్ వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్ర ఉచ్చారణ మధ్య అందంగా అలంకరించిన వెండి ఉయ్యాలలో శ్రీ బాల రాముని వెండి విగ్రహాన్ని ఉంచి భక్తిశ్రద్ధలతో నామకరణ కార్యక్రమం నిర్వహించారు.

సంప్రదాయ ప్రకారం ముందుగా రాజ్ కుమార్ దేశ్ పాండే శ్రీరాముని వెండి ఉయ్యాలను ఊపారు. అనంతరం మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే తోపాటు వేదపండితులు, గ్రామ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు గ్రామపెద్దలు ఉయ్యాలను ఊపడం జరిగింది. తెలంగాణనే కాకుండా ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర నుండి సైతం ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. శ్రీరామ స్మరణతో రామాలయం మారుమోగింది. భక్తులకు ప్రజలందరికీ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.రేపు శ్రీరామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం ఉత్సవం జరగనుంది. జుక్కల్ లో జాతర ఏర్పాటు అయింది.

Leave a Reply